Begin typing your search above and press return to search.

కోహ్లి వ్యూహం ఫలించిందోచ్!

By:  Tupaki Desk   |   12 Aug 2015 11:10 AM GMT
కోహ్లి వ్యూహం ఫలించిందోచ్!
X
టీమ్ ఇండియా ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా.. ఆ మాటకొస్తే సొంతగడ్డపై సిరీస్ ఆడినా.. ఒకటే కలవరం. మన బౌలర్లు ఏమాత్రం రాణిస్తారో.. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు ఏమేరకు కళ్లెం వేస్తారో అని ఒకటే టెన్షన్. బ్యాట్స్ మెన్ ఎంతగా రాణించినా మన బౌలర్లు తేలిపోవడం మామూలే. ఐతే కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం మన బౌలర్లపై నమ్మకముంచాడు. 20 వికెట్లు తీయాలంటే ఐదుగురు బౌలర్లు తుది జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. కెప్టెన్ గా పూర్తి స్థాయి బాధ్యతలు అందుకున్న తొలి మ్యాచ్ లోనే (బంగ్లాదేశ్ తో) తన వ్యూహం అమలు చేశాడు. ఐతే వర్షం వల్ల ఆ మ్యాచ్ సజావుగా సాగకపోవడంతో ఫలితం రాలేదు. ఇప్పుడు శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ లో మళ్లీ తన వ్యూహాన్ని అమల్లో పెట్టాడు. అద్భుతమైన ఫలితం రాబట్టాడు.

బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. లంక జట్టును తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే కుప్పకూల్చారు. స్పిన్నర్ అశ్విన్ 46 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి లంక పతనంలో కీలక పాత్ర పోషించాడు. మరో స్పిన్నర్ (2/20) కూడా రాణించాడు. ఐతే సీనియర్ స్పిన్నర్ హర్భజన్ మాత్రం విఫలమయ్యాడు. అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇషాంత్ శర్మ, ఆరోన్ చెరో వికెట్ తీశారు. లంక బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ మాథ్యూస్ (64), చండిమాల్ (59) మాత్రమే రాణించారు. ఓ దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ లంకను వీళ్లిద్దరూ ఆదుకున్నారు. ఐతే వీళ్లిద్దరూ ఔటయ్యాక మళ్లీ లంక కథ మొదటికొచ్చింది. కేవలం 49.4 ఓవర్లలోనే లంక ఇన్నింగ్స్ ముగియడం విశేషం.