Begin typing your search above and press return to search.

కెప్టెన్ కొత్త పార్టీ.. బీజేపీతో కలిసి పోటీ?

By:  Tupaki Desk   |   20 Oct 2021 5:30 AM GMT
కెప్టెన్ కొత్త పార్టీ.. బీజేపీతో కలిసి పోటీ?
X
పంజాబ్ రాజకీయాలు అనూహ్య కీలక మలుపులు తిరిగాయి.. పంజాబ్ రాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ ను వీడుతూ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అంతేగాక బీజేపీతో పొత్తు కూడా ఉండనుందని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తాజాగా కేంద్రహొంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం గమనార్హం. తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను వ్యక్తులను కలుపుకుపోతామని అమరీందర్ సింగ్ తమ అధికారి ప్రతినిధి ద్వారా వెల్లడించారు.

ఇక బీజేపీ సాగుచట్టాలపై పోరాడిన అమరీందర్ తాజాగా ఆ పార్టీతోనే పొత్తుకు రెడీ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. పైగా కేంద్రమంత్రి అమిత్ షాతో రైతు నిరసనలపై చర్చించామని అమరీందర్ సింగ్ తెలిపారు. త్వరలోనే తాను తనసొంత పార్టీని ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ వెల్లడించారు. పంజాబ్ ప్రజల ప్రయోజనాల కోసం ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాళీదల్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ కొత్త పార్టీ పెట్టి బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అకాళీదల్, ధిండ్సా, బ్రహ్మపుర లాంటి పార్టీలను కలుపుకుపోయేందుకుసిద్ధమని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ అలా చేయకుండా కొత్త పార్టీ పెట్టి బీజేపీతో కలిసి వెళ్లేందుకు మోగ్గు చూపడం విశేషం. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమరీందర్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం పంజాబ్ రాజకీయాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

79 ఏళ్ల అమరీందర్ సింగ్.. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. అంతేకాక.. పంజాబ్ రాష్ట్రంలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్దూకు అప్పగించడంపై అమరీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు, అధిష్టానం తీరుతో అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు.