Begin typing your search above and press return to search.

బంజారా హిల్స్ రో.నెం.3... య‌మా డేంజ‌ర్‌

By:  Tupaki Desk   |   12 July 2017 5:24 AM GMT
బంజారా హిల్స్ రో.నెం.3... య‌మా డేంజ‌ర్‌
X
చిన్నారి ర‌మ్య గుర్తుందా? దాదాపు ఏడాది కింద‌ట స్కూల్ నుంచి తాత‌.. త‌ల్లి.. బాబాయ్ తో బ‌య‌లుదేరిన చిన్నారి ర‌మ్య ఇంటికి కారులో వెళుతుండ‌గా.. డివైడ‌ర్‌ను ఢీకొట్టిన కారు ఇంకో కారు మీద‌ ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డ‌టం.. ఆపై ఒక చిన్నారి మ‌ర‌ణించ‌టం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్ని తీవ్రంగా క‌లిచివేసిన ఈ ఉదంతం అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

ఇంచుమించు అదే స్పాట్‌కు ద‌గ్గ‌ర్లో అదే రోడ్డులో నిన్న మ‌రో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ఒక యువ‌కుడు మ‌ర‌ణించాడు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వేళ‌లో బంజారాహిల్స్ రోడ్డు నెంబ‌రు 3లో.. సాగ‌ర్ సొసైటీ చౌర‌స్తా నుంచి దూసుకొచ్చిన కారు అదుపు త‌ప్పి.. డివైడ‌ర్‌ను బ‌లంగా తాక‌ట‌మే కాదు.. మూడు ప‌ల్టీలు కొట్టి.. అదే వేగంతో అవ‌త‌లి రోడ్డులో త‌ల‌కిందులుగా బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 19 ఏళ్ల ఫ‌సాహ‌త్ అలీ అనే ఇంజ‌నీరింగ్ విద్యార్థి దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.

చిన్నారి ర‌మ్య మ‌ర‌ణించిన డెత్ స్పాట్‌కు కూతవేటు దూరంలోనే తాజా ప్ర‌మాదం చోటు చేసుకోవ‌టం.. మ‌రో మ‌ర‌ణానికి తెర తీయ‌టం గ‌మ‌నార్హం. బంజారాహిల్స్ లోట‌స్ పాండ్ నివాసి అయిన అలీ రోడ్డు నెంబ‌రు 3లోని ముఫ‌కంజా ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో బీటెక్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు.

మంగ‌ళ‌వార‌మే కాలేజీ క్లాస్ లు స్టార్ట్ అయ్యాయి. అదే రోజు మ‌ధ్యాహ్నం స్నేహితుల్ని తీసుకొని త‌న కారులో భోజ‌నం కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాడు. రోడ్ నెంబ‌రు 3లోని గ్రీన్ మ‌సీదు ప‌క్క‌నున్న ఆల్ సీజ‌న్స్ లో భోజ‌నం చేశారు. తిరిగి కాలేజీకి వ‌స్తున్న వేళ‌.. సీటు బెల్టు పెట్టుకోకుండా అలీ కారు న‌డిపాడు. వేగంగా ప్ర‌యాణించిన కారును కంట్రోల్ చేయ‌టంలో విఫ‌ల‌మై ఆలీ విలువైన ప్రాణం పోయిన దుస్థితి.

నిజానికి ఈ ప్ర‌మాదం జ‌రిగింది మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌న్న‌ర ప్రాంతంలో కావ‌టంతో ఘోర ప్ర‌మాదం త‌ప్పింద‌ని చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలోర‌ద్దీ త‌క్కువ‌గా ఉంటుంది. కారు వేగంగా వెళ్ల‌టం.. డివైడ‌ర్‌ను ఢీ కొట్ట‌టం.. అది డివైడ‌ర్‌ను దాటి ప‌క్క రోడ్డులోకి బోల్తా కొట్ట‌టం చూసిన‌ప్పుడు.. ఆ టైంలో ఆ వైపు వేరే కారు వెళితే .. ఆ కారు వారికి ప్ర‌మాదం జ‌రిగేది. ఏడాది క్రితం చిన్నారి ర‌మ్య కూడా ఇదే రోడ్డులో ఇదే తీరులో మ‌ర‌ణించింది. రోడ్డు ప్ర‌మాదానికి మితిమీరిన వేగంతో పాటు.. ఇంజ‌నీరింగ్ లోపాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారు వేగం గంట‌కు 100 కిలోమీట‌ర్లుగా చెబుతున్నారు.