Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ లో కారు దూకుడు.. మూడురౌండ్లలో మెజార్టీ

By:  Tupaki Desk   |   24 Oct 2019 4:24 AM GMT
హుజూర్ నగర్ లో కారు దూకుడు.. మూడురౌండ్లలో మెజార్టీ
X
ఎన్నికల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికను చెప్పాలి. తెలంగాణ అధికారపక్షానికి తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో జరిగిన ఉప ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు రెండు రోజుల ముందు జరిగిన పరిణామాలతో మొత్తం ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి.

పోలింగ్ జరిగిన తీరుతో హుజూర్ నగర్ లో కారు దూసుకెళ్లటం ఖాయమని.. టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్ అంచనాలు తప్పలేదు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత పోస్టల్ బ్యాలెట్ లోనూ అధిక్యత కనపర్చిన టీఆర్ఎస్.. మూడు రౌండ్ ముగిసే నాటికి తన మెజార్టీని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.

మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి 2500 అధిక్యత లభిస్తే.. రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 4వేల మెజార్టీకి పెరిగింది. మూడు రౌండ్ లెక్క ముగిసేసరికి ఈ మెజార్టీ 6500కు పెరిగింది. చూస్తుంటే.. రౌండ్ రౌండ్ కి పెరుగుతున్న మెజార్టీతో ఘన విజయాన్ని సాధించే దిశగా గులాబీ కారు దూసుకెళుతుందని చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న గులాబీ క్యాంపులో.. తాజా ఫలితం స్థైర్యాన్ని పెంచటమే కాదు.. ఫుల్ ఖుషీతో ఉన్నారు. మొత్తం 22 రౌండ్ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగుస్తుంది. మూడు రౌండ్లకే ఆరువేల మెజార్టీ అంటే.. మొత్తం లెక్క పూర్తి అయ్యేసరికి మెజార్టీ మరెంత వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.