Begin typing your search above and press return to search.

వామ్మో.. అంత వేగ‌మా?: క‌రెంట్ స్థంభాన్ని ఎక్కేసిన కారు

By:  Tupaki Desk   |   9 May 2019 5:20 AM GMT
వామ్మో.. అంత వేగ‌మా?: క‌రెంట్ స్థంభాన్ని ఎక్కేసిన కారు
X
కారేంటి?.. క‌రెంట్ స్థంభాన్ని ఎక్కేయ‌టం ఏమిట‌న్న సందేహం అక్క‌ర్లేదు. మితిమీరిన వేగం.. ఇలాంటి సిత్రాన్ని ఆవిష్క‌రించింది. హైద‌రాబాద్ లో తాజాగా చోటు చేసుకున్న ప్ర‌మాదాన్ని చూసిన వారు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. బుధ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ రోడ్డు ప్ర‌మాదం చూస్తే.. డ్రైవింగ్ చేసేట‌ప్పుడు మ‌రీ ఇంత నిర్ల‌క్ష్య‌మా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

బీభ‌త్సం సృష్టించిన ఈ వ్య‌వ‌హారంలోకి వెళితే.. సైదాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్థి ష‌ఫీ.. త‌న న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి కాఫీ తాగేందుకు జూబ్లీహిల్స్ కు కారులో వెళుతున్నారు. ఖాళీగా ఉన్న రోడ్ల మీద చెల‌రేగిపోయిన ష‌ఫీ.. మితిమీరిన వేగంతో దూసుకెళ్లారు. ల‌క్డీకాపూల్ నుంచి జూబ్లీహిల్స్ కు వెళ్లే క్ర‌మంలో.. జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ మ‌లుపు బ‌స్టాండ్ వ‌ద్ద‌కు రాగానే.. కారు మీద నియంత్ర‌ణ కోల్పోయారు.

దీంతో.. అదుపు త‌ప్పిన కారు ఫుట్ పాత్ పైకి ఎక్క‌ట‌మే కాదు.. అక్క‌డే ఉన్న విద్యుత్ స్థంభం పైకి దూసుకెళ్లింది. అదృష్ట‌వ‌శాత్తు.. స్థంభం మీద ఉన్న విద్యుత్ తీగ‌లు కారును తాక‌క‌పోవ‌టంతో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పించింది. కారులో విప్పుకున్న ఎయిర్ బెలూన్స్ తో న‌లుగురు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. కాకుంటే.. స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయి. ఈ ఉదంతం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని ప్ర‌మాదం జ‌రిగిన తీరును చూసి ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నారు. ఎంత నిర్ల‌క్ష్యంగా న‌డిపితే.. క‌రెంటు స్థంభం మీద‌కు కారు ఎక్కుతుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.