Begin typing your search above and press return to search.

ఎండ‌లో కారు పార్కింగ్‌.. లైఫ్ రిస్కేన‌ట‌!

By:  Tupaki Desk   |   29 May 2018 5:30 PM GMT
ఎండ‌లో కారు పార్కింగ్‌.. లైఫ్ రిస్కేన‌ట‌!
X
మండే ఎండ‌లో కారును పార్క్ చేయ‌టం చాలా మామూలుగా చేస్తుంటారు. ఈసారి అలా పార్క్ చేసే ముందు కాస్త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పే అధ్య‌య‌న‌మిది. ఎండ‌లో కారు పార్కింగ్‌ తో ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంద‌న్న కొత్త విష‌యాన్ని తాజాగా గుర్తించారు. ఎండ‌లో కారు ఏకంగా ప్రాణాలు తీసే వీలుంద‌న్న షాకింగ్ విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో అరిజోనా స్టేట్ వ‌ర్సిటీల ప‌రిశోధ‌కులు తాజాగా ఒక అధ్య‌య‌నాన్ని చేప‌ట్టారు. వేస‌విలో ఆరు కార్ల‌తో ఒక ప్ర‌యోగాన్ని చేప‌ట్టారు. ఇందులో భాగంగా మండే ఎండ వేళ‌.. కార్ల‌ను పార్క్ చేశారు. కొన్ని గంట‌ల అనంత‌రం కారు లోప‌ల ఉష్ణోగ్ర‌త‌ల్ని లెక్కించారు. ఇవి మామూలు కంటే ఎక్కువ‌గా ఉండ‌ట‌మే కాదు.. కారులోని వివిధ ప్రాంతాల్లో వివిధ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద ఉన్న విష‌యాన్ని గుర్తించారు.

ఎండ‌లో పార్కింగ్ చేసే కార్ల‌లో ఉండే ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా రెండేళ్ల వ‌య‌సున్న చిన్నారుల ప్రాణాల‌కు ముప్పు వాటిల్లే ప్ర‌య‌మాదం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించారు. ఎండ‌లో ఒక గంట పాటు కారును పార్క్ చేసిన త‌ర్వాత స్టీరింగ్ వ‌ద్ద 52 సెంటీగ్రేడ్లు.. సీట్ల ద‌గ్గ‌ర 50 సెంటీగ్రేడ్లు.. డాష్ బోర్డు ద‌గ్గ‌ర 69 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్ర‌త న‌మోదైంద‌న్నది గుర్తించారు.

అదే స‌మ‌యంలో నీడ‌లో ఒక గంట పాటు కారును నిలిపితే.. అందులో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్ర‌త న‌మోదైన‌ట్లుగా లెక్క క‌ట్టారు. ఎండ‌లో కారును పార్క్ చేసిన త‌ర్వాత‌.. చిన్నారుల‌తో అందులో ప్ర‌యాణం చేయ‌టం ఏ మాత్రం క్షేమ‌క‌రం కాదంటున్నారు. అయితే.. పార్క్ చేసిన కారును ఆన్ చేసి.. కాసేపు కూల్ చేసిన త‌ర్వాత‌..పిల్ల‌ల్ని కారులో ఎక్కించ‌టం మేల‌ని చెబుతున్నారు. సో.. ఎండ‌లో కారు పార్క్ చేస్తున్న వారు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.