Begin typing your search above and press return to search.

ఇక సిద్ధం కండి.. ఏపీలోనూ క్యారవాన్ పరుగులే!

By:  Tupaki Desk   |   2 Aug 2022 7:58 AM GMT
ఇక సిద్ధం కండి.. ఏపీలోనూ క్యారవాన్ పరుగులే!
X
మ‌నిషి జీవితం ఇప్పుడు ఉరుకుల ప‌రుగులమ‌యంగా మారిపోయింది. ఒత్తిడితో, అల‌స‌ట‌తో కూడిన జీవితంతో సంతోష‌మ‌నేది లేకుండా పోయింది. ఒక‌టి, రెండు రోజులు ఖాళీ దొరికితే ఏదైనా విహార‌యాత్ర చేయాల‌ని అంద‌రూ ఉబ‌లాట‌ప‌డుతున్నారు. ఇలాంటివారి కోస‌మే కొత్త‌గా క్యార‌వాన్ టూరిజం వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ఉన్న ఈ క్యార‌వాన్ టూరిజం అతి త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకి అడుగుపెట్ట‌నుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

వాస్త‌వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టూరిజం శాఖ క్యారవాన్‌ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం దాన్ని తెలంగాణ టూరిజం అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీఎస్‌టీడీసీ) నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్‌ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది.

సినిమా హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద సెల‌బ్రిటీల‌కు మాత్ర‌మే ఇప్ప‌టిదాకా క్యార‌వాన్లు చూశాం. ఇక నుంచి అలాంటివాటిని సాధార‌ణ ప‌ర్యాట‌కులు కూడా చూడొచ్చు. ఈ క్యార‌వాన్ లోపలి భాగం ఓ స్టార్‌ హోటల్‌ గదిలాగే ఉంటుంద‌ని చెబుతున్నారు. అత్యాధునిక లే-బ్యాక్‌ కుషన్‌ కుర్చీలూ, సోఫా-కమ్‌ బెడ్‌లూ, డైనింగ్‌ టేబుళ్లతోపాటు కిచెన్‌ కూడా ఉంటుంద‌ని అంటున్నారు. అందులో ఆధునిక గ్లాస్‌ టాప్‌ స్టవ్వూ, ఫ్రిజ్జూ, ఓవెన్‌లూ ఉంటాయి. ఆధునిక టాయిలెట్‌ కమ్‌ షవర్‌బాత్‌ ఏర్పాట్లు ఇదో వాహనమన్న మాటే మర్చిపోయేలా చేస్తాయ‌ని పేర్కొంటున్నారు.

ఇక ఆడియో, వీడియో, వైఫై సౌక‌ర్యాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదంటున్నారు. క్యార‌వాన్ లో ప‌ర్యాట‌కులు ఉన్న సూట్ నుంచే నుంచి డ్రైవర్‌తో మాట్లాడటానికి ఇంటర్‌కమ్‌ కనెక్షనూ ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ క్యారవాన్‌ని అద్దెకు తీసుకుని ఏపీ పర్యాట‌క‌ సంస్థ చెప్పిన ప్రాంతాలకే కాదు... చుట్టుపక్కల మారుమూల స్థలాలకీ వెళ్లొచ్చ‌ని వివ‌రిస్తున్నారు. రాత్రయినా సరే అక్కడే గడపొచ్చు.

ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌కు సంబంధించి ఈ క్యారవాన్‌లోని జీపీఎస్‌ ద్వారా ఓ బృందం ప‌ర్యాట‌కుల‌ను సదా పర్యవేక్షిస్తూ ఉంటుంద‌ని అంటున్నారు. అవసరమైతే అప్పటికప్పుడు ఓ వైద్యబృందాన్నీ కూడా పంపిస్తారు. క్యార‌వాన్ అడవిలో ఉన్నా సరే... 24 గంటలూ ఏసీ, లైట్లూ పనిచేసేలా ఏమాత్రం చప్పుడు చేయని పవర్‌ జనరేటరూ ఇందులో ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

అంతేకాకుండా.. మనకి వంట చేయడం ఇష్టం లేకపోతే స్థానికులచేతే చేయించుకోవచ్చ‌ని అంటున్నారు. అక్కడి కళల్ని ఆస్వాదించడానికీ, క్యాంప్‌ఫైర్‌లాంటివి ఏర్పాటుచేసుకోవడానికీ ఇవి ఎంతో ఉపయోగపడతాయ‌ని చెబుతున్నారు.

కాగా ఒక పగలూ-రాత్రికి క్యార‌వాన్ కి ఎంత తీసుకుంట‌ర‌నేది త్వ‌రలో నిర్ణ‌యిస్తార‌ని అంటున్నారు. క్యార‌వాన్ ల‌తో హోటల్‌ బుక్‌ చేసుకునే అవసరం కూడా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌కుల మొగ్గు కూడా ఇటే ఉంటుంద‌ని అంటున్నారు.

ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ఈ క్యార‌వాన్ లో ప్రయాణించవచ్చు. డ్రైవర్‌తో పాటు లేకుంటే సెల్ఫ్‌ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్‌ టూర్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు.