Begin typing your search above and press return to search.

మోడీ టూర్ లో బండి.. ఈటలకు దక్కిన పలకరింపులు ఎలానంటే?

By:  Tupaki Desk   |   6 Feb 2022 3:32 AM GMT
మోడీ టూర్ లో బండి.. ఈటలకు దక్కిన పలకరింపులు ఎలానంటే?
X
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మోడీ టూర్ పూర్తైయింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ మహానగరం శివారులో జరిగిన రెండు పెద్ద కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. తొలుత రానని.. తర్వాత వస్తానని.. తెగ కన్ఫ్యూజ్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీ టూర్ కు డుమ్మా కొట్టేశారు. అయితే.. దీన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రందీనిపై ఆసక్తికర చర్చే జరుగుతోంది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు శనివారం చోటు చేసుకున్న ‘డుమ్మా’ యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఇక.. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈటల రాజేందర్ కు ప్రత్యేక గుర్తింపు లభించిందనే చెప్పాలి. చాలామంది బీజేపీ నేతలు ప్రధాని మోడీని పలుకరించే ప్రయత్నం చేసినా.. ఈ ఇద్దరు నేతలకు మాత్రం ప్రత్యేక పలుకరింపులు సొంతమైనట్లుగా చెప్పాలి. ఈ రెండింటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు వేదిక కావటం ఆసక్తికరంగా చెప్పాలి.

శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేతల్ని పలువురిని పలుకరించినప్పటికీ.. బండి సంజయ్ ను మాత్రం.. ‘క్యా బండీ.. కైసే హై?’ అంటూ భుజం తట్టి పలుకరించిన వైనం అందరిని ఆకర్షించింది. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఇక్రిశాట్ కు హెలికాఫ్టర్ లో బయలుదేరి వెళ్లారు.

అనంతరం శంషాబాద్ లోని ముచ్చింతలకు వెళ్లి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని.. తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చిన ప్రధాని మోడీకి వీడ్కోలు పలికేందుకు పలువురు నేతలు హాజరయ్యారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళలో ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరే వేళలో.. ఈటల రాజేందర్ ను బండి సంజయ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ.. ‘చోటా ఆద్మీ బడా కామ్ కరే’ అంటూ ఈటలను ఉద్దేశించి వ్యాఖ్యానించి.. ఆయన భుజం తట్టి వెళ్లారు. మొత్తానికి మిగిలిన నేతల్ని పలుకరించిన పలకరింపులతో పోలిస్తే.. ఈ ఇద్దరు నేతలకు మాత్రం ప్రత్యేక పలుకరింపులు లభించాయని చెబుతున్నారు.