Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ ను కొట్టి.. మూత్రం తాగించిన బీజేపీ ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   1 Jan 2020 7:13 AM GMT
కానిస్టేబుల్ ను కొట్టి.. మూత్రం తాగించిన బీజేపీ ఎమ్మెల్యే?
X
అధికారం చేతిలో ఉంటే చాలు చెలరేగిపోయే ప్రజాప్రతినిధులకు నిలువెత్తు నిదర్శనంగా మారారు బీజేపీ ప్రజాప్రతినిధులు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఉదంతం వింటే.. మరీ ఇంత దారుణమా? అన్న భావన కలగటం ఖాయం. తన తప్పేమీ లేనప్పటికీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దారుణమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఆరాచకం తెలిస్తే.. ఇలా కూడా చేయొచ్చా? అన్న సందేహం కలుగక మానదు.


యూపీలోని బర్ఖేరా అసెంబ్లీ నియోజక వర్గానికి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ లాల్ రాజ్ ఫుట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అనుచరుల్లో ఒకరైన రాహుల్ నుంచి టూవీలర్ ను పోలీస్ కానిస్టేబుల్ మోహిత్ కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి రూ.50వేలు ఇచ్చాడు కూడా. అయితే.. బండిని రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వెళితే.. పత్రాలు సరిగా లేవని చెప్పి రిజిస్టర్ చేయలేదు. దీంతో.. తన డబ్బులు తనకు ఇచ్చేయాలని కానిస్టేబుల్ కోరాడు. అందుకు ఓకే చెప్పిన రాహుల్ ఫిలిబిత్ మండి సమితి గేటు వద్దకు రావాలనిచెప్పటంతో అక్కడికి వెళ్లాడు కానిస్టేబుల్.


అనూహ్యంగా అక్కడ ఎమ్మెల్యే మేనల్లుడుతో పాటు మరికొంత మంది కలిసి కానిస్టేబుల్ మోహిత్ పైన దాడి చేశారు. అతని వద్ద ఉన్న డబ్బులు.. బంగారు గొలుసును లాక్కున్నారు. అంతేకాదు.. కాల్పులు కూడా జరిపారు. కాల్పుల నుంచి తప్పించుకున్న అతడు.. అసోం టోడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.


ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మనుషులు మరోసారి కానిస్టేబుల్ మీద దాడి చేయటమే కాదు.. పోలీసుల ఎదుటే మూత్రం తాగాలని బలవంతం చేశారు. ఇదంతా పోలీసులు చూస్తున్నా ఎవరూ అడ్డుకోలేదని వాపోయాడు. కేసు నమోదు చేసి ఎమ్మెల్యే మీదా.. అతని అనుచరుల మీదా చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ను ఆశ్రయించాడు. చివరకు కోర్టు ఆదేశాలతో తాజాగా ఎమ్మెల్యే మీదా ఆయన అనుచరులు 35 మంది మీదా కేసులు నమోదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.