Begin typing your search above and press return to search.

సోదరులపై కేసు..బెంగాల్లో సంచలనం

By:  Tupaki Desk   |   8 Jun 2021 12:30 AM GMT
సోదరులపై కేసు..బెంగాల్లో సంచలనం
X
పశ్చిమబెంగాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సువేందుతో పాటు ఆయన సోదరుడు సౌమేందు అధికారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సంచలనంగా మారింది. మొన్నటి ఎన్నికలకు ముందు ఇదే సువేందు, సౌమేందు కుటుంబం యావత్తు సీఎం మమతాబెనర్జీకి అత్యంత సన్నిహితులుగా ఉండారు.

బీజేపీ అగ్రనేతల ఒత్తిడి, ప్రలోభాల కారణంగా హఠాత్తుగా తృణమూల్ ను వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుండి సువేందు కుటుంబానికి మమతకు పరిస్ధితులు ఉప్పు నిప్పులాగ తయారైంది. సువేందు మీద కోపంతోనే మమత నందిగ్రామ్ అసెంబ్లీలో పోటీ చేశారు. అయితే ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి. సువేందును నందిగ్రామ్ నుండి కదలనీయకుండా చేసిన కారణంగానే తృణమూల్ అభ్యర్ధులు మిగిలిన నియోజకవర్గాల్లో గెలిచారు.

తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికి తెలిసిందే. అయితే తాజాగా సోదరులిద్దరిపైనా పోలీసులు కేసులు నమోదుచేయటం సంచలనంగా మారింది. ఇందుకు కారణం ఏమిటంటే కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు సభ్యుడైన రత్నదీప్ మన్నా చేసిన ఫిర్యాదుతోనే పోలీసులు సోదరులపై కేసులు నమోదుచేశారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మొన్నటి మే నెల 29వ తేదీన మధ్యాహ్నం సోదరులిద్దరు కంతి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి లక్షల రూపాయలు విలువచేసే పునరావాస వస్తువులను బలవంతంగా తీసుకెళ్ళారట. మున్సిపల్ గోడౌన్ కు వేసిన తాళాలు పగలగొట్టి మరీ వస్తువులను ఎత్తుకెళ్ళినట్లు రత్నదీప్ మన్నా ఫిర్యాదు చేశారు. సో పోలీసులు సోదరులపై కేసులు నమోదుచేశారు. అంటే ఏదో రోజు వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసులు వీళ్ళద్దరినీ అరెస్టు చేస్తే ఏమి జరుగుతుందో చూడాలి.