Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ కోడెల కుమారుడిపై చోరీ కేసు న‌మోదు!

By:  Tupaki Desk   |   30 April 2017 5:26 AM GMT
స్పీక‌ర్ కోడెల కుమారుడిపై చోరీ కేసు న‌మోదు!
X
ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కుమారుడు డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణపై దొంగ‌త‌నం కేసు న‌మోదైంది. అనూహ్య ప‌రిణామాలు.. ఆపై చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న‌పైనా.. మ‌రికొంద‌రిపైనా చోరీ కేసు న‌మోదైంది. నిజానికి ఈ కేసును ఈ నెల 13న పోలీసులు ఫైల్ చేసిన‌ప్ప‌టికీ.. ఇన్ని రోజులుగా బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. కేసు న‌మోదు విష‌యాన్ని ఏపీ పోలీసులు గుట్టుగా ఉంచేశారు. అయితే.. నిప్పు లాంటి నిజం కాస్త ఆల‌స్యంగా అయినా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ అంత పెద్ద కోడెల కొడుకు దొంగ‌త‌నం కేసులో బుక్ కావ‌టం ఏమిటి? అన్న డౌట్‌ను తీర్చుకోవాలంటే.. విష‌యం మొత్తం తెలిస్తేనే తే స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇంత‌కీ.. ఏపీ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కోడెల కొడుకు పైన ఏపీ పోలీసులు చోరీ కేసు ఎందుకు న‌మోదు చేయాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంలోకి వెళితే..

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో న‌ల్ల‌పాటి కేబుల్ విజ‌న్ కేబుల్ వైర్ల‌ను కె ఛాన‌ల్ నిర్వాహ‌కుడు డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌.. అత‌డి అనుచ‌రులు గ‌త ఏడాది మార్చి 17న ధ్వంసం చేసి.. డ్ర‌మ్ములు.. యాంప్లిఫ‌య‌ర్లు చోరీ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఉదంతంపై ఎన్ సీవీ ఎండీ లాం కోటేశ్వ‌ర‌రావు వ‌న్ టౌన్.. టూ టౌన్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. వాట్స‌ప్ మెసేజ్‌ల రూపంలోనూ ఫిర్యాదును ఉన్న‌తాధికారుల‌కు పంపారు. కానీ.. పోలీసులు మాత్రం కేసు న‌మోదు చేయ‌లేదు. దీంతో.. ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఉదంతంపై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది.

ఈ ఉదంతంపై స్పందించిన హైకోర్టు గుంటూరు జిల్లా రూర‌ల్ ఎస్పీ.. డీఎస్పీ.. వ‌న్ టౌన్.. టూ టౌన్ సీఐల‌ను కోర్టు ఎదుట హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. కోర్టుకు హాజ‌రైన అధికారుల్ని.. కేసు ఎందుకు న‌మోదు చేయ‌లేద‌న్న విష‌యాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. కేసు న‌మోదు చేయ‌నందుకు క్ష‌మాప‌ణ‌లు కోరిన అధికారులు..నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారిపై ఛార్జిమెమో ఇచ్చిన‌ట్లుగా కోర్టుకు తెలిపారు. దీంతో.. కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తున‌కు సంబంధించి నివేదిక‌ను త‌మ‌కు మే 9న ఇవ్వాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఈ నెల 13న కోడెల కుమారుడిపై చోరీ కేసు న‌మోదు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/