Begin typing your search above and press return to search.

ఎంపీ ర‌ఘురామ‌పై కేసు.. A1గా న‌మోదు.. రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   5 July 2022 2:50 PM GMT
ఎంపీ ర‌ఘురామ‌పై కేసు.. A1గా న‌మోదు.. రీజ‌న్ ఇదే
X
ఎంపీ రఘురామకృష్ణ‌రాజు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని రఘురామపై ఆరోపణలు వచ్చాయి. రఘురామ కుమారుడు భరత్‌‌తో పాటు ఆయన పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

A1గా రఘురామరాజు, A2గా భరత్, A3 సందీప్‌(సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్), A4 ఏఎస్సై(సీఆర్పీఎఫ్‌), A5 శాస్త్రి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

కాగా జులై 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రఘురామరాజు జులై 3న సాయంత్రం నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లేందుకు ప్రయత్నించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన రఘురామరాజు.. బేగంపేటలో దిగిపోయారు. అనంతరం ఆయన గచ్చిబౌలిలోని ఇంటికి వెళ్లారు.

అయితే రఘురామ ఇంటి వద్ద జులై 4న ఉదయం ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించి... లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని.. ఆయన్ను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని రఘురామరాజు తెలిపారు. సీసీ టీవీలో వ్యక్తి కదలికలను గుర్తించిన తమ ఇంటి సిబ్బంది.. ఐడీ కార్డు తీసుకుని ఆరా తీస్తే ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పీసీ బాషాగా తేలిందని రఘురామ చెప్పారు.

12 మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తన ఇంటి వద్ద కాపు కాశారని... తన వాహనాన్ని వెంబడించారని పోలీస్ అధికారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం రఘురామరాజుపై హైదరాబాద్‌ గచ్చిబౌలిలో పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామతో పాటు సీఆర్పీఎఫ్ పోలీసులపై కూడా కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

``ప్రధాని భద్రతా విధుల్లో ఉండగా నాపై దాడి చేశారు. ఎంపీ రఘురామ ఇంట్లో నన్ను 3 గంటలు నిర్బంధించారు. రఘురామ సహా ఐదుగురు నాపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే నాపై దాడి చేశారు. నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని చెప్పినా వినలేదు. నా ఐడీ కార్డు, పర్స్‌ లాక్కుని విడతలవారీగా హింసించారు. ఎంపీ, మరో ముగ్గురు లాఠీలతో కొట్టి దుర్భాషలాడారు`` అని కానిస్టేబుల్ ఫ‌రూక్ బాషా అన్నారు.