Begin typing your search above and press return to search.

ముర‌ళీమోహ‌న్ పై సైబ‌రాబాద్ లో కేసు!

By:  Tupaki Desk   |   4 April 2019 11:03 AM GMT
ముర‌ళీమోహ‌న్ పై సైబ‌రాబాద్ లో కేసు!
X
మాదాపూర్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.2 కోట్లకు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. ఈ మొత్తానికి సంబంధించి బాధ్యులు రాజ‌మండ్రి ఎంపీ.. సీనియ‌ర్ సినీ న‌టుడు ముర‌ళీమోహ‌న్ కు సంబంధించిన‌విగా పోలీసులు పేర్కొంటూ కేసు న‌మోదు చేశారు.

రైల్వేస్టేష‌న్లో ప‌ట్టుబ‌డ్డ రూ.2 కోట్ల మొత్తం ముర‌ళీమోహ‌న్ తో పాటు మ‌రో ఐదుగురి మీద కేసు న‌మోదు చేసిన‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌న్నార్ వెల్ల‌డించారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక పోలీసు బృందాల‌కు శ్రీ‌హ‌రి.. పండ‌రి అనే వ్య‌క్తులు హైటెక్ సిటీలో అనుమానాస్ప‌దంగా క‌నిపించార‌ని.. వారి వ‌ద్ద ఉన్న బ్యాగుల్ని త‌నిఖీ చేయ‌గా రూ.2 కోట్ల మొత్తం దొరికిన‌ట్లుగా పేర్కొన్నారు.

వీరిని విచారించ‌గా జ‌య‌భేరి ఉద్యోగులు జ‌గ‌న్మోహ‌న్‌.. ధ‌ర్మ‌రాజులు వారికి డ‌బ్బులు ఇచ్చిన‌ట్లుగా నిందితులు పేర్కొన్నార‌ని.. ఈ డ‌బ్బు కోసం య‌ల‌మంచిలి ముర‌ళీకృష్ణ‌.. ముర‌ళీమోహ‌న్ లు రాజ‌మండ్రిలో ఎదురుచూస్తున్న‌ట్లుగా వారు చెప్పార‌న్నారు. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కు.. అక్క‌డి నుంచి గ‌రీబ్ ర‌థ్ రైల్లో రాజ‌మండ్రికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిపైన ఐపీసీసెక్ష‌న్ 171 (బీ).. (సీ).. (ఈ).. (ఎఫ్‌) ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. రాజ‌మండ్రి ఎంపీ అభ్య‌ర్థిగా ముర‌ళీమోహ‌న్ కోడ‌లు రూప పోటీ చేస్తున్నారు. ఆమెకు అంద‌జేసేందుకే తాము ఈ మొత్తాన్ని తీసుకెళున్న‌ట్లు నిందితులు చెప్పిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం. నిన్న (బుధ‌వారం) దొరికిన రూ.2కోట్ల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని.. ముర‌ళీమోహ‌న్ ప‌రారీలో ఉన్న‌ట్లుగా పోలీసులు పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఈ ఉదంతంలో ముర‌ళీమోహ‌న్ పైన కేసు న‌మోదు చేశారు.