Begin typing your search above and press return to search.

అసద్ ఖాతాలో మరో కేసు

By:  Tupaki Desk   |   15 July 2016 5:25 AM GMT
అసద్ ఖాతాలో మరో కేసు
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే రాజకీయ నేతకు లేని కేసుల ట్రాక్ రికార్డ్ మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంతమని చెప్పాలి. రెచ్చగొట్టేతరహాలో వ్యవహరించటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. మత రాజకీయాల్ని చేయటంలో దిట్ట అయిన అసద్.. అవసరమైతే ఎలాంటి రాజకీయ నేతపై నైనా భౌతికదాడి చేసేందుకు సైతం వెనుకాడరు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పైన సైతం చేయి చేసుకునేందుకు తెగబట్టే పరిస్థితి.

ఇన్ని చేసినా.. దర్జాగా తిరిగేస్తుంటారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే.. ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో ఉగ్రవాద చర్యలకు ప్లాన్ వేసి.. జాతీయ దర్యాప్తు బృందం చేతికి చిక్కిని ఐసిస్ సానుభూతిపరుల విషయంలో అసద్ చేసిన వ్యాఖ్యలు పలువురిని విస్మయానికి గురి చేసింది. పెద్ద ఎత్తున మతకల్లోలాలకు పాల్పడటం.. బాంబు పేలుళ్లతో మారణకాండ తెగబడేందుకు పక్కా ప్లాన్ వేసుకున్న వారికి న్యాయసహాయం అందిస్తామంటూ చేసిన ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ అసద్ పట్టించుకోని పరిస్థితి.

నిందితులకు న్యాయ సహాయం పొందటం హక్కని.. అందుకే వారికి తాము న్యాయ సాయం చేస్తామని సమర్థించుకునే ప్రయత్నం చేశారే తప్పించి.. తాను సాయం చేస్తానన్నది ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు పావులు కదిపిన వ్యక్తులకన్న విషయాన్ని పట్టించుకోకపోవటం గమనార్హం. అసద్ తీరుపై ఒళ్లు మండిన కరుణసాగర్ అనే న్యాయవాది తాజాగా రంగారెడ్డిజిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఐసిస్ సానుభూతిపరులకు న్యాయసహాయం చేస్తానని వ్యాఖ్యలు చేయటంపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనికి స్పందించిన కోర్టు ఐపీసీ సెక్షన్124 కింద కేసు నమోదు చేయాలని సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించిన విచారణను పూర్తి చేసి నివేదికను ఈ నెల 30లోపు తమకు సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నో కేసులున్న అసద్ కు ఇది మరో కేసు అవుతుందే తప్పించి.. ఆయనపై ఎలాంటి ప్రభావాన్నిచూపదన్న వ్యాఖ్య మజ్లిస్ సానుభూతిపరులు పలువురు లోగుట్టుగా వ్యాఖ్యానించుకోవటం గమనార్హం.