Begin typing your search above and press return to search.

అర్నాబ్ గోస్వామి పై తెలంగాణ లో కేసు నమోదు..?

By:  Tupaki Desk   |   24 April 2020 6:20 AM GMT
అర్నాబ్ గోస్వామి పై  తెలంగాణ లో కేసు నమోదు..?
X
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి అర్నాబ్ గోస్వామిపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి.. అర్నాబ్ గోస్వామిపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు అర్నాబ్ పై కేసు నమోదు చేశారు. టీవీ చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ తోపాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు అర్నాబ్ గోస్వామిపై ఫిర్యాదు చేశారు. అయితే, తనపై దాడికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, వాద్రా కుటుంబమే బాధ్యత వహించాలంటూ అర్నాబ్ గోస్వామి కూడా ముంబై లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. సోనియా, వాద్రా ఫ్యామిలీలపై అనేక సందర్భాల్లో వచ్చిన తప్పుడు, ఫేక్ వార్తలపై తానే స్వయంగా స్పందించి వారిపై ప్రజలకు ఓ స్పష్టత ఇచ్చానని , అలాంటి నాపై ఇలాంటి దాడులు చేయడం సరికాదు అని అర్నాబ్ చెప్పుకొచ్చారు.

కాగా, ముంబైలో బుధవారం రాత్రి ఆఫీసు నుంచి అర్నాబ్ గోస్వామి, ఆయన భార్య తమ కారులో ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఇద్దరు దుండగులు గోస్వామి కారుపై నల్ల సిరా చల్లి బెదిరిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసి అక్కడ్నుంచి పరారయ్యారు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.