Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టు.. సీబీఐ అధికారిపై కేసు నమోదు

By:  Tupaki Desk   |   23 Feb 2022 5:40 AM GMT
వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టు.. సీబీఐ అధికారిపై కేసు నమోదు
X
పెను సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పుడో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారిపోవటం.. మరోవైపు నాటి పులివెందుల సీఐ.. డీఎస్పీతో పాటు పలువురు సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించిన వివరాలు కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాయి. దీంతో.. ఏపీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హత్య కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారి సీబీఐకి చెందిన రామ్ సింగ్ మీద స్థానిక రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హం. వివేకా హత్య కేసు విచారణ పేరుతో తనను వేధిస్తున్నట్లుగా పులివెందుల బకారా పురానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఈ నెల 15న ఏఆర్ అదనపు ఎస్పీ మహేశ్ కుమార్ ను కలిసి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయటంతో కొత్త పరిణామం చోటు చేసుకుంది.

ఈ కేసులో నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కుమార్ రెడ్డి గురించి తెలిసిందే. అతని తండ్రి.. హత్యకు గురైన వివేకా శరీరానికి అయిన గాయాలను కుట్లు వేసి.. ప్లాస్టర్లు వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగిన వేళలో ఉదయ్ కుమార్ రెడ్డి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పాటు.. అతడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉన్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఇలాంటివేళ.. ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులను ఆశ్రయించి.. సీబీఐ అధికారి రామ్ సింగ్ మీద సరికొత్త ఆరోపణలు చేవారు. ఈ హత్య కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పినా.. సీబీఐ అధికారులు పట్టించుకోవటం లేదని.. వారు చెప్పినట్లుగా వినాలని వేధిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. విచారణ పేరుతో ఇప్పటికి 22 సార్లు తనను పిలిచారని.. ఆ సందర్భంగా మానసిక.. శారీరక ఇబ్బందులు పెడుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

తన ఫిర్యాదును కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐ అధికారిపై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తాజాగా రామ్ సింగ్ పై ఐపీసీ 195ఏ.. 323.. 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కొత్త ట్విస్టు.. సీబీఐ వేగానికి స్పీడ్ బ్రేకర్ గా మారుతుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.