Begin typing your search above and press return to search.

కోడెల తనయుడిపై కేసు నమోదు!

By:  Tupaki Desk   |   8 Jun 2019 1:09 PM GMT
కోడెల తనయుడిపై కేసు నమోదు!
X
అపార్ట్ మెంట్ భవనాలను నిర్మించే బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో మాజీ స్పీకర్ , తెలుగుదేశం నేత కోడెల శివ ప్రసాద్ రావు తనయుడు కోడెల శివరామ్ మీద కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు బిల్డర్ల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారట పోలీసులు.

అందుకు సంబంధించి పక్కా సాక్ష్యాధారాలతో సదరు బిల్డర్లు కోడెల శివరాం మీద ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కోడెల తనయుడు ‘కే ట్యాక్స్’ను వసూలు చేసినట్టుగా చాన్నాళ్ల నుంచి ఆరోపణలున్నాయి. ఆ ప్రాంతంలో ఏ పని జరగాలన్నా, ప్రతిదాంట్లోనూ కోడెల తనయుడికి డబ్బులు ఇచ్చుకోవాల్సిందే అని, అలా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కోడెల తనయుడితో పాటు కూతురు కూడా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. కోడెల సంతానం అడ్డూఅదుపూ లేకుండా వసూళ్లకు పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తూ వచ్చింది.

ఈ నేఫథ్యంలో తాజాగా కోడెల శివరాంపై కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది. ఒక బిల్డర్ కు అతడు నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ లోని ఒక్కో ఫ్లాట్ కు యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని కోడెల శివరాం నుంచి బెదిరింపులు వెళ్లాయట. ఆ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ల లెక్కల ప్రకారం మొత్తం పదిహేడు లక్షల రూపాయల మొత్తాన్ని డిమాండ్ చేశారట కోడెల శివారం అనుచరులు.

తను పద్నాలుగు లక్షల రూపాయలు చెల్లించుకోగా, మిగిలిన మూడు లక్షల విషయంలో వేధింపులు కొనసాగుతూ ఉన్నాయని సదరు బిల్డర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సమాచారం. ఈ ఫిర్యాదు మేరకు కోడెల శివరామ్ మీద పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.