Begin typing your search above and press return to search.

పార్కింగ్ పేరుతో ఫోరం సుజ‌నా మాల్ దోపిడీ?

By:  Tupaki Desk   |   5 Oct 2017 5:44 AM GMT
పార్కింగ్ పేరుతో ఫోరం సుజ‌నా మాల్ దోపిడీ?
X
హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ మాల్స్ లో ఒక‌టిగా పేరున్న ఫోరం సుజ‌నా మాల్ పై కేసు న‌మోదైంది. జేఎన్‌ టీయూ రోడ్డులో ఉండే ఈ భారీ మాల్ నిత్యం సంద‌ర్శ‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. తాజాగా ఈ మాల్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా.. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌కు విరుద్ధంగా సంద‌ర్శ‌కుల నుంచి.. వినియోగ‌దారుల నుంచి పార్కింగ్ రూపంలో అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేయ‌టంపై తార్నాక‌కు చెందిన విజ‌య్ గోపాల్ అనే సంద‌ర్శ‌కుడు కేపీహెచ్‌బీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

తాను ఏపీ 09 పీఏవీ 3141 నెంబ‌రు కారులో ఫోరం సుజ‌నామాల్‌ కు వెళ్లాన‌ని.. పార్కింగ్ ఫీజు కింద రూ.50 వ‌సూలు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ యాక్ట్ 1955 - సెక్ష‌న్ 115(40) ప్ర‌కారం ఏదైనా స్థ‌లంలో సంద‌ర్శ‌కుల్ని ఆహ్వానించేందుకు ఉన్నది ప‌బ్లిక్ ప్లేస్ గా గుర్తించాల్సి ఉంది. అందులో చేప‌ట్టే నిర్మాణాల‌కు వెళ్లాల‌నుకునే సంద‌ర్శ‌కుల వాహ‌నాల‌కు స‌రిప‌డా పార్కింగ్ స్థ‌లం వ‌ద‌లాల్సి ఉంది.

వాణిజ్య అవ‌స‌రాల కోసం కాంప్లెక్స్ ల‌లో 44 శాతం బిల్డ‌ప్ ఏరియా కింద పార్కింగ్ కోసం స్థ‌లాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అయితే.. పార్కింగ్ ప్ర‌దేశాన్ని కామ‌న్ ఏరియా ప‌రిధిలోకి వ‌స్తుందంటూ కామ‌న్ ఏరియాను అమ్మ‌టం.. లీజుకు ఇవ్వ‌టం నిషేధంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ లు.. రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ ల‌లో పార్కింగ్ కోసం అద‌న‌పు డ‌బ్బులు వ‌సూలు చేసే హ‌క్కులు ఎవ‌రికీ లేవ‌న్న‌ది ఫిర్యాదు దారుడి వాద‌న‌. పార్కింగ్ వ‌సూలు చేసేందుకు హ‌క్కు లేకున్నా.. అందుకు భిన్నంగా వ‌సూలు చేస్తున్న నేప‌థ్యంలో స‌ద‌రు మాల్ య‌జ‌మాని య‌ల‌మంచ‌లి స‌త్య‌నారాయ‌ణ చౌద‌రితో పాటు మ‌రో ఆరుగురిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఫోరం సుజ‌నా మాల్ మీద కేసు న‌మోదు చేశారు.