Begin typing your search above and press return to search.

తీన్మార్ మల్లన్నపై కేసు: ఆ పోలీస్ అధికారికి బీసీ ప్యానెల్ సమన్లు

By:  Tupaki Desk   |   27 Aug 2021 5:30 AM GMT
తీన్మార్ మల్లన్నపై కేసు: ఆ పోలీస్ అధికారికి బీసీ ప్యానెల్ సమన్లు
X
ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్ట్.. రాజకీయ విమర్శకుడు అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తనపై నమోదైన కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై పోరాడుతున్నాడు. తనపై వరుస కేసులను నమోదు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆరోపిస్తున్నాడు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్.సీ.బీసీ)కు ఈ మేరకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశాడు. ఎన్.సీబీసీ నుంచి తీన్మార్ మల్లన్నకు అవసరమైన మద్దతు లభించింది.

తీన్మార్ మల్లన్న నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్.సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి గురువారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ లకు సమన్లు పంపారు. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 29 ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేశాడు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మల్లన్నను తెలంగాణ పోలీసుల నుంచి అనవసర వేధింపులకు గురిచేశారని.. దీనిపై వివరణ ఇవ్వాలని.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సమన్లలో కోరినట్లు తల్లోజు ఆచారి తెలిపారు. కమిషన్ లో దీనికి సంబంధించి విచారణ కోసం డీజీపీ, పోలీస్ కమిషనర్ ను స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తీన్మార్ మల్లన్నపై తీసుకున్న చర్య/ నివేదికను ఈమెయిల్ ద్వారా సమర్పించాలని కోరారు.

‘సంబంధిత ఫైల్స్, కేస్ డైరీ, మొదలైన సంబంధిత డాక్యుమెంట్లతో పాటు తాజా నివేదిక/చర్య తీసుకున్న నివేదికను తీసుకురావాలని’ ఆచారి కోరారు. కమిషన్ లో ప్రత్యుత్తరాలు సమర్పించడానికి కనీసం ఐదు అఫిడవిట్లను తీసుకురావాలని ఎన్.సీబీసీ సభ్యుడు ఆదేశించాడు.

ఒకవేళ డీజీపీ, పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరు కాకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బి నిబంధన (8) ప్రకారం సివిల్ కోర్టు ఇచ్చిన అధికారాలను కమిషన్ ఉపయోగించవచ్చని.. మీ హాజరు కోసం సమన్లు జారీ చేయవచ్చనని ఆచారి హెచ్చరించారు. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరు కావాలని స్పష్టం చేశారు.