Begin typing your search above and press return to search.

ప్ర‌శ్నించిన పాపానికి... జ‌గ‌న్‌ పై కేసు

By:  Tupaki Desk   |   1 March 2017 7:12 AM GMT
ప్ర‌శ్నించిన పాపానికి... జ‌గ‌న్‌ పై కేసు
X
టీడీపీ నేత‌లు జేసీ బ్ర‌ద‌ర్స్ కు చెందిన దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన ఏపీ విప‌క్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. ఈ మేర‌కు కృష్ణా జిల్లా నందిగామ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ ఇచ్చిన పిర్యాదు మేర‌కు నందిగామ పోలీసులు జ‌గ‌న్‌ పై ఐపీసీ 353 - 506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జ‌గ‌న్ వెంట ఆసుప‌త్రికి వెళ్లిన వైసీపీ నేత‌లపైనా కేసులు న‌మోద‌య్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాల్లోకెళితే... దివాక‌ర్ ట్రావెల్స్‌ కు చెందిన బ‌స్సు ప్ర‌మాదానికి గురి కాగా... 10 మంది చ‌నిపోగా, 30 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించ‌డంతో పాటు మృతుల కుటుంబాల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు వైఎస్ జ‌గ‌న్ నిన్న హుటాహుటిన నందిగామ వెళ్లారు. నందిగామ‌లో అడుగుపెట్టిన వెంట‌నే ఆయ‌న నేరుగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వెళ్లారు. అక్క‌డ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఆయ‌న ఘ‌ట‌న వివ‌రాల‌ను తెలుసుకునే య‌త్నం చేశారు.

ఈ సంద‌ర్భంగా బ‌స్సు డ్రైవ‌ర్ మృత‌దేహానికి శ‌వ ప‌రీక్ష (పోస్టు మార్ట‌మ్‌) చేయ‌కుండానే మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు చేసిన ఏర్పాట్ల‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్ వైద్యుల‌ను ప్ర‌శ్నించారు. పోస్టు మార్ట‌మ్ చేయ‌ని విష‌యాన్ని వైద్యులు కూడా ఒప్పుకోగా... అందుకు సంబంధించి వైద్యులు రూపొందించిన నివేదిక‌ల‌ను చేతుల్లోకి తీసుకున్న జ‌గ‌న్‌... వాటిని త‌న వ‌ద్దే ఉంచుకుంటాన‌ని చెప్పారు. అయితే అందుకు స‌సేమిరా అన్న వైద్యులతో ఆయ‌న వాగ్వాదానికి దిగారు. ప్ర‌తిప‌క్ష నేత అడిగితే కూడా నివేదిక‌కు సంబంధించిన కాపీని ఇవ్వ‌రా? అని జ‌గ‌న్ వారిని నిల‌దీశారు. మూడు కాపీల్లో ఒక‌దానినే క‌దా తీసుకుంటున్న‌ది... ఇంకా రెండు కాపీలు ఉంటాయి క‌దా అని కూడా జ‌గ‌న్ చెప్పారు. అయినా వైద్యులు విన‌లేదు. జ‌గ‌న్ చేతుల్లోని నివేదిక ప్ర‌తుల‌ను లాగేసుకునేందుకు య‌త్నించారు.

అయితే జ‌గ‌న్ కూడా వెన‌క్కు త‌గ్గ‌కుండా... టీడీపీ ఎంపీకి చెందిన బ‌స్సు కావ‌డంతోనే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు వెలుగులోకి రాకుండా చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న వైద్యుల‌పై మండిప‌డ్డారు. అదే స‌మ‌యంలో కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ కూడా అక్క‌డికి చేరుకుని జ‌గ‌న్ చేతుల్లోని ప‌త్రాల‌ను చివ‌ర‌కు లాగేసుకున్నారు. త‌న చేతుల్లోని ప‌త్రాల‌ను లాగేసుకున్న క‌లెక్ట‌ర్, వైద్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇదీ నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌. నిన్న రాత్రి దాకా సైలెంట్ గానే ఉన్న‌ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ నేటి ఉద‌యం పోలీస్ స్టేష‌న్‌ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. జ‌గ‌న్ త‌మ విధుల‌ను అడ్డుకున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జ‌గ‌న్‌పై పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/