Begin typing your search above and press return to search.

వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయమన్న కోర్టు

By:  Tupaki Desk   |   22 July 2021 4:09 AM GMT
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయమన్న కోర్టు
X
ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుతో పాటు.. పోలీసు అధికారిగా ఆయనకున్న ఇమేజ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువమంది పోలీసు అధికారులకు మాత్రమే ఉంటుందని చెప్పే మాజీ ఐపీఎస్ అధికారిప్రవీణ్ కుమార్ కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. అనూహ్యంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన తీరు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

కొద్ది నెలల్లో జరిగే హుజూరా బాద్ ఉప ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరిగి.. అందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చిన ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని.. దర్యాప్తు చేయాలంటూ కోర్టు ఆదేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఐపీఎస్ అధికారి అయినప్పటికీ తెలంగాణ గురుకుల కార్యదర్శిగా వ్యవహరిస్తూ.. స్వేరోస్ సంస్థను ఏర్పాటు చేసిన వైనం.. దాని కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు తరచూ మీడియాలో రావటం తెలిసిందే. మిగిలిన పోలీసు అధికారులకు భిన్నమైన శైలిని ప్రదర్శించే ఆయన.. అనూహ్యంగా తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేయటం ఎందుకన్న అంశం ఇప్పుడో పెద్ద మిస్టరీలా మారింది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీల్లో చేరాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే..తాజాగా కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి సుధ తాజాగా ఆదేశాలు జారీ చేస్తూ.. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఇంతకీ ఆయనేం తప్పు చేశారు? ఏ ఉదంతంలో ప్రవీణ్ కుమార్ కు ఈ షాక్ తగిలిందన్న విషయంలోకి వెళితే..కొద్ది నెలల (ఈ ఏడాది మార్చిలో) క్రితం పెద్ద పల్లి జిల్లా జూలపల్లి మండలం ధూళికట్ట గ్రామంలో ‘స్వేరోస్’ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గురుకుల కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఇందులో స్వేరోస్ సభ్యుడు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన న్యాతరి శంకర్ బాబు సభకు హాజరైన అందరి సభ్యుల చేత ఒక ప్రతిజ్ఞ చేయించారు. ఇది పెను వివాదంగా మారింది. దీనికి సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారాయి.

ఇంతకూ ఆ ప్రతిజ్ఞ లో ఉన్న అంశాలేమిటన్నది చూస్తే.. ‘హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు. వాళ్ళను పూజించం. గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల మీద నమ్మకం లేదు. వాళ్లను పూజించం. శ్రాద్ధ కర్మలు పాటించము. పిండదానాలు చేయబోము’’ అంటూ చేసిన వైనంపై అప్పట్లో పెను దుమారం రేగింది. పలువురు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

ఎవరి మత విశ్వాసాలపై ఎవరికైనా నమ్మకం లేకుంటే ఫాలో కాకపోవటం తప్పేం కాదు. వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయానికి భిన్నంగా.. ఒక జట్టుగా పెద్ద ఎత్తున ఈ తరహా ప్రతిజ్ఞ ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది. మత విశ్వాసాల్ని దారుణంగా దెబ్బ తీసే ఈ ప్రతిజ్ఞను అప్పట్లో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా చేయటం.. ఆయన తన ఎడమ చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞ చేసిన వీడియో క్లిప్పులు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఆయన తీరును పలువురు తప్పు పట్టారు. ఇప్పుడు అదే ఉదంతంపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్న ఈ ప్రతిజ్ఞను తీవ్రంగా పరిగణించిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి.. హిందూ దేవుళ్లను అవమానించారని.. హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ తీశారని.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ వ్యవహారం ఉందంటూ మార్చి 16న కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో సదరు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. మరో న్యాయవాది యెన్నం పల్లి గంగాధర్ సాయంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి సాయిసుధ.. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మీదా.. న్యాతరి శంకర్ బాబులపైనా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.