Begin typing your search above and press return to search.

బాబు-రేవంత్ కు షాక్‌...సీబీఐకు `ఓటుకు నోటు`?

By:  Tupaki Desk   |   6 Nov 2017 4:14 PM GMT
బాబు-రేవంత్ కు షాక్‌...సీబీఐకు `ఓటుకు నోటు`?
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నానంత‌రం ఓటుకు నోటు కేసు ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆడియో టేపులు బ‌య‌ట‌ప‌డ‌డం పెను సంచ‌ల‌నం రేపింది. సాక్ష్యాత్తు ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎమ్మెల్సీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాడ‌న్న ఆరోప‌ణ‌లు దేశ రాజ‌కీయాల్లో దుమారం రేపాయి. అప్ప‌ట్లో టీటీడీపీ నేత - కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి....ఎమ్మెల్సీ స్టీఫెన్ స‌న్ తో సంభాషిస్తున్న‌ వీడియో మీడియాలో ప్ర‌సారం అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన ఆ కేసు....త‌ద‌నంత‌రం మ‌రుగున ప‌డిపోయింది. టీటీడీపీ-టీఆర్ ఎస్ ల మ‌ధ్య జ‌రిగిన చీక‌టి ఒప్పందాల ప్ర‌కారం ఆ కేసు విచార‌ణ‌ను అట‌కెక్కించార‌నే విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. ఆ కేసు విచార‌ణ ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ కేసు విచార‌ణ పురోగ‌తిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ కేసు విచార‌ణ‌లో జాప్యం జ‌రుగుతోంద‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసు స‌ద్దుమ‌ణిగింద‌నుకుంటున్న చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి ల‌కు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల షాక్ ఇచ్చారు. ఆ కేసు విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌డం లేదంటూ సుప్రీం ను ఆశ్ర‌యించారు. అంతేకాకుండా, ఈ కేసు దర్యాప్తును తెలంగాణ ఏసీబీ శాఖ నిష్పక్షపాతంగా చేయడం లేదని ఆళ్ల సుప్రీంకు విన్న‌వించారు. మొదటి ఛార్జీషీటుకు, రెండో ఛార్జీషీటుకు వ్యత్యాసం ఉందని ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువ‌ల్ల ఈ కేసును సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తుకు అప్పగించాలని పిటిష‌న్ లో కోరారు. ఆళ్ల పిటిష‌న్ ను ప‌రిశీలించిన సుప్రీం దానిని స్వీక‌రించింది. అంతేకాకుండా, ఓటుకు నోటు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్ ని జత చేయాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పిటిష‌న్ విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామ‌ని సుప్రీం తెలిపింది.

సుప్రీం త‌న పిటిష‌న్ ను స్వీక‌రించ‌డం, ఆదేశాలు జారీ చేయ‌డం పై ఆళ్ల రామకృష్ణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడని, అందుకే ఈ కేసు విచారణ జ‌ర‌గ‌కుండా ఆయ‌న‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆడియో టేపుల్లోని వాయిస్‌ చంద్రబాబేనని రుజువైందని, చంద్ర‌బాబు పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలని అన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు సరిగా చేయడం లేదని, ఎలాగైనా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్యే ఆర్కే లాయర్ సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో నిష్పక్షపాత దర్యాఫ్తు కోసం సీబీఐ విచారణ చేప‌ట్టాల‌ని ఆర్కే పిటిషన్ వేశారని అన్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి....టీడీపీకి గుడ్ బై చెప్పి హ‌స్త‌గ‌తం అయిన సంగ‌తి తెలిసిందే. రేవంత్‌...టీడీపీని వీడ‌డంతో తెలంగాణ‌లో ఆ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఆర్కే పిటిష‌న్ తో టీడీపీ ప‌రిస్థితి.....మూలిగే న‌క్కపై తాటికాయ ప‌డ్డ‌ట్లు అయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు రేవంత్ కు బాస‌ట‌గా నిలిచిన చంద్ర‌బాబు ఇక‌పై కూడా అదే ధోర‌ణిని కొన‌సాగిస్తారా? లేక ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరిన రేవంత్ ను ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న రీతిలో వ‌దిలేస్తారా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌! ఆర్కే పిటిష‌న్ పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏ విధంగా స్పందిస్తారో అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధాన‌మివ్వాలి.