Begin typing your search above and press return to search.

క్యాష్ లేక కాంగ్రెస్ క్యార్..క్యార్ !

By:  Tupaki Desk   |   13 Oct 2018 11:31 AM GMT
క్యాష్ లేక కాంగ్రెస్ క్యార్..క్యార్ !
X
ఎన్నిక‌లొస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నేతలకు - నాయకులకు ఎంతో హడావుడి, అంతే కాదు ఎంతో ఖర్చు కూడా... బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ర్యాలీలు నిర్వహించాలి. ప్రజలను బహిరంగ సభలకు తరలించాలి. ఇంకా చాలా చేయాలి.. ఇవన్నీ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. దీని కోసం డబ్బు కావాలి. ఇదంతా ఎందుకంటే జాతీయ పార్టీయైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పైసాలు లేక పరిషాన్ అవుతోందట. ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందట. ఆ పార్టీకి నిధులు సమకూర్చడానికి ఎవరూ ముందుకు రావటం లేదని వినికిడి. ప్రస్తుతం పార్టీ బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలను - నాయకులను తమ సొంత ఖర్చులతోనే పార్టీ సమావేశాలకు హాజ‌రు కావాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖర్చులు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి నాయకులు తమ నియోయవర్గాలకు వెళాల్సి వస్తే, పార్టీ ఖర్చులు భరించదని తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలలో భారీ వాహనాలు వాడవద్దని ఆదేశించినట్లు సమాచారం. ఎంపీ - ఎమ్మెల్యేలకు పార్టీ ఇచ్చే సదుపాయలకు సంబంధించిన రవాణ ఖర్చులు కూడా తిరిగి ఇవ్వమని చెప్పినట్లు తెలుస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్ - మిజోరాంలలో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటకలో జరిగిన ఐటి దాడులతో ఆ పార్టీ ఆర్థికంగా కుదేలైంది. ఇక మిజోరాం విషయానికి వస్తే ఆర్దికంగా ఆదుకునేంత వనరులు ఆ రాష్ట్రం ద‌గ్గ‌ర‌ లేవు. పంజాబ్ రాష్ట్రం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇవ్వగలదు. అయితే ఆ రాష్ట్రం మాత్రం ఎంత వరకూ ఆదుకోగలదూ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలతో పాటు సెమిఫైనల్ గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో కూడా డబ్బులు ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దంగా లేదు. జాతీయ పార్టీయైన కాంగ్రెస్‌లో కోట్లకు పడగలెత్తిన నాయకులు భారీగానే ఉన్నారు. అయితే వారంతా వ్యక్తిగత వ్యయానికే తమ డబ్బు వినియోగిస్తారు తప్ప, పార్టీ కోసం మాత్రం ఖర్చు చేసే వారు కాదంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిధుల విషయంలో చాలా వెనుకబడి ఉంది. భారతీయ జనతా పార్టీకి అమిత్ షా వంటి నాయకులు వందల కోట్ల నిధులను విరాళాల రూపంలో తీసుకు రాగలరు. ఒకప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీగా విరాళాలు తీసుకు వచ్చేవారు. ఒక దశలో ఆయన తీసుకు వచ్చిన విరాళాలతోనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించింది. ఇప్పుడు పార్టీలో అలాంటి నాయకులు లేరు.. ఆ విరాళాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితులలో క్యాష్ లేక కాంగ్రెస్ పార్టీ విలవిలాడుతోంది..