Begin typing your search above and press return to search.

కరెన్సీ వర్షం కురిపించిన కోతి

By:  Tupaki Desk   |   20 July 2015 8:41 AM GMT
కరెన్సీ వర్షం కురిపించిన కోతి
X
కోతుల సంగతి తెలిసిందే... అవి ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరూ చెప్పలేం... ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఇటీవల అలాంటి సిట్యుయేషనే ఒకటి జరిగింది. ఆ కోతి ఏకంగా ఓ పర్యాటకురాలి బ్యాగును ఎత్తుకుపోయి అందులో ఉన్న లక్షన్నర రూపాయలను రోడ్లపైకి విసిరేసి నానా హంగామా సృష్టించింది.

ముంబైలోని బొరివలీ ప్రాంతానికి చెందిన హేమవతి సోంకర్(50) తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి బృందావనం వెళ్లారు. అక్కడ బాంకీ విహారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత రోడ్డు పక్కనున్న దుకాణాల్లో అవీఇవీ కొనుక్కుంటున్నారు. అంతలో ఓ కోతి ఆమె చేతిలో ఉన్న బ్యాగుపై కన్నేసింది..... అందులో ఏముందనుకుందో ఏమో కానీ హఠాత్తుగా కిందికి దూకి హేమవతి చేతిలోని బ్యాగ్ అందుకుని ఒక్క ఉదుటున పారిపోయింది. దుకాణం పైకి ఎక్కి అందులో ఏముందో చూసింది.... తినడానికేమీ దొరక్కపోవడంతో అందులోని నోట్ల కట్టలను బయటక తీసి విసరడం ప్రారంభించింది. ఇంకేముంది.... డబ్బులు ఏరుకునేందుకు అక్కడున్నవారంతా పోటీ పడ్డారు. కాగా, తమకు దొరికిన నోట్లను చాలా మంది హేమవతికి తిరిగిచ్చేసి నిజాయితీ చాటుకున్నారు. మరికొంతమంది మాత్రం డబ్బును జేబులో వేసుకుని జారుకున్నారు.

హేమావతి బ్యాగులో సుమారు లక్షన్నర క్యాష్ ఉందట.... అందులో ఆమెకు అయిదారువేలు మాత్రమే తిరిగొచ్చింది. మిగతాదంతా జనం చేతిలో పడిపోయింది. మొత్తానికి కోతి దెబ్బకు బృందావనంలో కరెన్సీ వర్షం కురిసింది.