Begin typing your search above and press return to search.

రైతు బజార్ల వరకూ వచ్చేసిన క్యాష్ లెస్

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:11 AM GMT
రైతు బజార్ల వరకూ వచ్చేసిన క్యాష్ లెస్
X
క్యాష్ లెస్ వచ్చేసింది. ఎంత వరకంటే.. రైతు బజార్లో నిమ్మకాయ కొన్నా జేబులో నుంచి చిల్లర డబ్బులుఇవ్వాల్సిన అవసరం లేదు. అంతెందుకు.. కరివేపాకు కొన్నా కూడా కార్డులతో కొనేసే అవకాశం వచ్చేసింది. ఇలాంటివన్నీ సిద్దిపేటలో కదా అన్న డౌట్ అక్కర్లేదు. హైదరాబాద్ లోని రైతు బజార్లోనూ క్యాష్ లెస్ కు అవకాశం వచ్చేసింది. ఆ మాటకు వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే విధానం తెర మీదకు వచ్చేసింది.

ఈ విధానం రానున్న రోజుల్లో మరింత జోరుగా సాగటమే కాదు.. క్యాష్ లెస్ ప్రక్రియ అంత అసాధ్యమైనదేమీ కాదన్న భావన కలిగేలా చేస్తోంది. ఇంతకీ.. రైతుబజార్లలో.. అదీ రూ.5.. రూ.10 ఖర్చు చేసే చోట క్యాష్ లెస్ ఎలా? అందులోకి రైతు బజార్ అంటే అందరూ చదువుకున్నోళ్లు.. బ్యాంకు కార్డులు ఉన్న వారే రారు కదా? అలాంటి వారు దీన్నెలా వాడుకుంటారన్న డౌట్ రావొచ్చు. కానీ.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని అవన్నీ సాధ్యమేనన్నది తేలటమే కాదు.. వేలాది మంది ఈ విధానాన్ని వినియోగిస్తూ.. క్యాష్ లెస్ ఇంత సింఫులా అని ఫీలయ్యే పరిస్థితి.

చేతిలో ఎలాంటి డెబిట్.. క్రెడిట్ కార్డులు లేకున్నా క్యాష్ లెస్ చెల్లింపులు ఎలా సాధ్యమన్న విషయానికి వస్తే..

ఇప్పుడు అమలు చేస్తున్న విధానంలో బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలు. క్యాష్ లెస్ లావాదేవీకి మార్గం సుగమం అయినట్లే. చేతిలో క్రెడిట్ కార్డు లేకున్నా.. రైతుబజారుకు వెళ్లిన వారికి సాయంగా ఉండేలా ఐడీఎఫ్ సీ బ్యాంకు ద్వారా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి వెళ్లిన వారు.. తమ వేలిముద్ర ఇచ్చాక.. తమ ఆధార్ నెంబరు చెబితే చాలు.. మొబైల్ లో ఫీడ్ చేస్తారు. అంతే.. సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు కనెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత సదరు వ్యక్తి కోరుకున్నంత మొత్తానికి సరిపడా కూపన్లు (ఈ కూపన్లు రూ.5 నుంచి మొదలవుతాయి) ఇస్తారు.

వాటిని తీసుకున్న ఖాతాదారులు తమకు అవసరమైన కూరగాయల్ని.. ఆ కూపన్లతో కొనుగోలు చేస్తారు. అలా రైతుబజారు మొత్తం తమకు నచ్చిన షాపుల్లో ఈ కూపన్ల సాయంతో కొనుగోళ్లు పూర్తి చేశారు. అంతా అయ్యాక.. చేతిలో నలభై రూపాయిలకు సరిపడా కూపన్లు మిగిలిపోయాయని అనుకుంటే.. ఆ కూపన్లను ఎక్కడైతే తీసుకున్నారో ఆ కౌంటర్ వద్దకువెళ్లి.. ఆధార్ నెంబరు చెప్పి.. వేలిముద్ర ఇవ్వటం ద్వారా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. ఈ ప్రక్రియ ఆలస్యం కాకుండా అప్పటికప్పుడు జరిగిపోవటంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో ఇబ్బందికరమైన ఇష్యూలే ఉండవా? అంటే ఉన్నాయనే చెప్పాలి.అవేమంటే.. కొద్దిమంది వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల్ని ఆధార్ తో లింకేజీ చేసుకోలేదు. అలాంటి వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాంటి వారు తమ బ్యాంకు ఖాతాను వెనువెంటనే ఆధార్ తో లింక్ అప్ చేసుకుంటే సరిపోతుంది. ఇదొకటైతే.. ఎప్పుడైనా ఆన్ లైన్ ఇష్యూ వచ్చినా.. సర్వర్ స్లో అయినా.. సినిమా కనిపించక మానదు. ఇది మినహా.. మిగిలిన సందర్భాల్లో ఈ విధానంతో ఎలాంటి ఇబ్బంది ఉండదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/