Begin typing your search above and press return to search.

కార్డుల ఆయుష్షు మరో మూడేళ్లేనా?

By:  Tupaki Desk   |   8 Jan 2017 7:02 AM GMT
కార్డుల ఆయుష్షు మరో మూడేళ్లేనా?
X
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదేమో. పాత చింతకాయ అని కొట్టిపారేస్తాం కానీ.. బిర్యానీ బిర్యానీనే.. పెరుగన్నం పెరుగన్నమే. అదే పనిగా బిర్యానీ తింటే బోర్ కొడుతుంది కానీ.. రోజు తినే పెరుగన్నం మాత్రం అస్సలు మొహమెత్తదు. ఏళ్ల కిందట మన పూర్వీకులు సెట్ చేసిన కొన్ని అంశాల్ని కాలక్రమంలో మర్చిపోయినా.. కొత్త కొత్త సాంకేతికతల కారణంగా వాటిని లైట్ తీసుకున్నా.. చివరకు మూలాలకే మళ్లీ ప్రయాణం కావటం ఇప్పుడు కనిపిస్తోన్న దృశ్యం.

ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో ఒక మేసేజ్ బాగా వైరల్ కావటమే కాదు.. దాన్ని చూసినంతనే నిజమే కదా? అన్న భావన కలిగేలా ఉండటం గమనార్హం. పాత కాలంలో వేలిముద్రలు ఉండేవని.. దాన్ని తేలిగ్గా చూసిన వారు.. ఇప్పుడు క్యాష్ లెస్ లావాదేవీలకు మళ్లీ నాటి వేలిముద్రల దగ్గరికే వెళ్లారంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఎంత కొత్త టెక్నాలజీ వచ్చేసినా.. మూలాలు మాత్రం మిస్ కావు కదా.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. మొదటి నుంచి ఉన్నవే.. ఏదో ఒక రూపంలో ఉండిపోగా.. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతున్న పరిస్థితిగా కనిపిస్తోంది. ఆ మధ్యన వచ్చిన కార్డుల వినియోగం రోజురోజుకీ మరింతగా పెరిగిపోతున్న వేళ.. నగదు రహిత లావాదేవీల కారణంగా..ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

అదెలానంటే.. డిజిటల్ లావాదేవీలను సర్వత్రా ప్రోత్సహిస్తున్న వేళ.. రానున్న మూడేళ్ల వ్యవధిలో ఏటీఎం కార్డులు.. మెషీన్లకు చెల్లుచీటి తప్పదని చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అన్నిచోట్లా డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరగటం.. ప్రభుత్వాలు సైతం ఇలాంటి వాటినే ప్రోత్సహిస్తున్న వేళ.. అయితే బొటన వేలు.. లేదంటే మొబైల్ ఫోన్ తోనే మొత్తం చెల్లింపుల ప్రక్రియ పూర్తి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా చెబుతున్నారు.

సాంకేతికంగా వస్తున్నమార్పులు.. డిజిటల్ చెల్లింపుల కారణంగా రానున్న మూడేళ్ల వ్యవధిలోభారత్ లోని ఏటీఎంలు.. క్రెడిట్ కార్డులు అదృశ్యం కావటం ఖాయమని చెబుతున్నారు. ఆధార్ కార్డు టెక్నాలజీతో ప్రతి లావాదేవీ 30 సెకన్లలో పూర్తి అవుతుందని.. 2020 నాటికి చెల్లింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. చూస్తుంటే.. ఇప్పుడు కానీ కాల్ డేటా.. మొబైల్ డేటా ఎలా అయితే కనిపించకుండా ఉంటుందో.. మన సంపాదన అంతా కూడా అంకెల్లో కనిపించటం తప్పించి.. నోట్ల రూపంలో చేత్తో పట్టుకొని చూసుకునే అవకాశం బాగా తగ్గిపోతున్నట్లు అనిపించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/