Begin typing your search above and press return to search.

క్యాసినో చికోటి ప్రవీణ్.. మాధవ్ రెడ్డిల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోట మాట రాదంతే!

By:  Tupaki Desk   |   28 July 2022 10:30 AM GMT
క్యాసినో చికోటి ప్రవీణ్.. మాధవ్ రెడ్డిల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోట మాట రాదంతే!
X
కంటి ముందు కనిపించేది నిజం. కానీ.. దాని వెనకున్నది ఏమిటన్న దానిపై కన్నేస్తే.. కొత్త నిజాలెన్నో వెలుగు చూస్తాయి. ఈడీ సోదాల నేపథ్యంలో వార్తల్లో వ్యక్తులుగా మారారు హైదరాబాద్ కు చెందిన చికోటి ప్రవీణ్.. మాధవ్ రెడ్డిలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారంతా క్యాసినో కింగ్ లుగా శ్రీలంక.. నేపాల్.. గోవాలలో భారీ ఎత్తున వ్యాపారాన్ని నిర్వహించే వ్యాపారవేత్తలుగా కనిపిస్తారు. అంతేనా.. రూ.కోట్ల కొద్దీ ఆస్తులు వారితో దర్శనమిస్తాయి. అయితే.. వారి ప్రస్థానం ఎలా మొదలైంది? వారు మొదట్లో ఎలా ఉండేవారు? వారిప్పుడున్న స్థానానికి చేరుకోవటానికి ముందు వారేం చేసేవారు? వారి మీద ఏమైనా నేరారోపణలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు జవాబులు వెతికితే.. షాకింగ్ నిజాలు బయటకొస్తాయి.

తాజాగా ఈడీ చేసిన సోదాల్లో చికోటి ప్రవీణ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఏపీలో ఆ మధ్యన నిర్వహించిన భారీ క్యాసినో వెనుక ఉన్నది చికోటి ప్రవీణ్ గా చెబుతారు. ఏపీ అధికార పక్షానికి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలు మాత్రమే కాదు.. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన భారీ క్యాసినో వెనుక ఉన్నది ప్రవీణ్ అని చెబుతారు. అలాంటి ప్రవీణ్ హైదరాబాద్ లోని సైదరాబాద్ లోని వినయ్ నగర్ కాలనీలో ఉంటాడు. గతంలో ఒక సినీ ప్రముఖుడ్ని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో కేసు కూడా ఉంది.

అతడి వ్యాపార ప్రస్థానాన్ని చూస్తే.. ఇరవై ఏళ్ల క్రితం చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారిగా వ్యవహరించేవాడు. తర్వాతి కాలంలో నిర్మాతగా మారి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఒక వైద్యుడ్ని కిడ్నాప్ చేసిన నేరంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత గోవాలోని ఒక కేసినోలో కొన్ని టేబుళ్లను లీజుకు తీసుకోవటంతో అతడి లైఫ్ మారిందని చెబుతారు. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తినట్లుగా చెబుతారు.

ఓవైపు డబ్బు సంపాదిస్తూనే.. మరోవైపు రాజకీయ.. అధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాల్ని ఏర్పర్చుుకున్న అతడికి సినిమా రంగంలోని కొందరితో లింకులు ఉన్నాయని చెబుతారు. తాను చేసే డీల్ కు అవసరానికి తగ్గట్లు పోలీసు సాయం కోసం కొందరు అధికారుల్ని తన మనుషులుగా మార్చుకున్నట్లు చెబుతారు. బిగ్ డాడీ పేరుతో నేపాల్.. శ్రీలంక.. ఇండోనేషియా.. థాయిలాండ్ తదితర దేశాల్లో క్యాసినో నిర్వహించే అతడు.. ఇటీవల తన పుట్టినరోజును భారీగా నిర్వహించాడు. దీనికి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కావటం చూస్తే.. అతగాడి రేంజ్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రవీణ్ కు కొందరు సినీ హీరోయిన్లతోనూ మంచి సంబంధాలు ఉన్నట్లుగా చెబుతారు. వారితో కలిసి కొన్ని వీడియోలు చేసినట్లుగా చెబుతారు.

చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇలా ఉంటే.. ఈడీ సోదాల్లో వినిపించిన మరో పేరు మాధవరెడ్డి. ఇతగాడి ప్రొఫైల్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్ లోని బోయినపల్లికి చెందిన ఇతడు.. తన కారుకు ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ను అంటించుకోవటం.. దాన్ని పోలీసులు చూసిచూడనట్లుగా వదిలేయటం చూస్తే.. అతగాడి స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మాధవ్ రెడ్డిని స్థానికంగా ముక్కు మాధవరెడ్డిగా కూడా పిలుస్తుంటారు.

కొన్నేళ్ల క్రితం పాలు.. పెరుగు అమ్ముతూ సాదాసీదా జీవితాన్ని జీవించిన అతగాడు ఈ రోజు కోట్లకు పడగలు ఎత్తటం ఒక ఎత్తు అయితే.. ఈ మధ్యనే నిర్వహించిన బోనాల సందర్భంగా దాదాపు కేజీ బరువున్న బంగారు ఆభరణాలు ఒంటి మీద వేసుకోవటం.. బౌన్సర్లను పెట్టుకొని తిరగటం చూసిన స్థానికులు అతడి రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో? అన్న చర్చ జరిగింది. గతంలో క్రికెట్ బెట్టింగ్ లతో భారీగా నష్టపోయిన అతడు.. ఆ తర్వాత హైప్రొఫైల్ వారికి సన్నిహితం కావటం.. వారితో పార్టీలు నిర్వహించటం.. ఆ సందర్భంలోనే ప్రవీణ్ తో జరిగిన పరిచయం అతడ్ని క్యాసినో డీలర్ గా మార్చేసినట్లు చెబుతారు.