Begin typing your search above and press return to search.

అంత‌టా కులాల గోలే!... పార్టీలూ వాటి చుట్టే!

By:  Tupaki Desk   |   13 March 2019 5:30 PM GMT
అంత‌టా కులాల గోలే!... పార్టీలూ వాటి చుట్టే!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో తెలుగు నేల‌లో ప్ర‌త్యేకించి ఏపీలో అటు పార్ల‌మెంటు, ఇటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అంద‌రి దృష్టి అక్క‌డే ఉంది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లకు ముందే ఏపీలో పొలిటిక‌ల్ హ‌డావిడి మొద‌లైపోయింది. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరుతున్న నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఆ హీట్ ను త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్నార‌నే చెప్పాలి. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత టికెట్లు ద‌క్క‌ని అభ్య‌ర్థుల గోల మొద‌లైపోయింది. తాజాగా సీట్ల కేటాయింపు విషయంలో ఆయా పార్టీలు అనుస‌రిస్తున్న వ్యూహాలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇటు అధికార పార్టీ టీడీపీతో పాటు అటు విప‌క్ష వైసీపీలకు ఈ ఎన్నిక‌లు కీల‌క‌మైన వేళ‌... ఏ ఒక్క స్థానాన్ని కూడా వ‌దులుకునేందుకు సిద్ధంగా లేని పార్టీలు... అభ్య‌ర్థుల ఖ‌రారులో త‌మ‌దైన శైలి వ్యూహాల‌కు తెర తీస్తున్నాయి. అయితే ఈ వ్యూహాల‌న్నీ కూడా కులం అనే కీల‌క ఫ్యాక్ట‌ర్ చుట్టూనే తిరుగుతున్న‌ట్లుగా ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ త‌ర‌హా సంస్కృతి ఒక్క టీడీపీలోనే కాకుండా వైసీపీలోనూ బాగానే క‌నిపిస్తోంది. అప్ప‌టిదాకా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌కర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేత‌లు.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల అభ్య‌ర్థులు ఖ‌రారు కాగానే ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సి వ‌స్తోంది. టీడీపీలోనూ ఈ త‌ర‌హా కుల ప్రాతిప‌దిక‌న రూపొందుతున్న వ్యూహాల‌కే అధిక ప్రాధాన్యం ల‌భిస్తోంది. మ‌నం గెల‌వ‌క‌పోయినా ఫ‌ర‌వా లేదు.... ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన ఇత‌ర కుల‌పోడు గెల‌వొద్దు అన్న చందంగా రూపొందుతున్న ఈ వ్యూహాలు జ‌నానికి ఏవ‌గింపు క‌లిగిస్తున్నా.... పార్టీలు త‌మ వ్యూహాల‌ను మార్చుకునేందుకు స‌సేమిరా అనే అంటున్నాయి. రాష్ట్రంలో రాజ‌కీయంగా కాస్తంత అవేర్ నెస్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని భావిస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ త‌ర‌హా కులాల కుంప‌ట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల కంటే ఈ రెండు జిల్లాల్లోనే కుల ప్రాతిప‌దిక‌న రూపొందుతున్న వ్యూహాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ల‌భిస్తుంది. కృష్ణా జిల్లాలో క‌మ్మ వ‌ర్సెస్ కాపు, గుంటూరు జిల్లాలో దీనితో పాటు ఈ రెండు వ‌ర్గాలు వ‌ర్సెస్ రెడ్డి వ్యూహం కూడా బాగానే వినిపిస్తోంది.

అవ‌తలి పార్టీ ఏ కులం అభ్య‌ర్థిని నిలిపితే... దాని ప్ర‌త్యర్థి పార్టీ కూడా అదే కులానికి చెందిన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించుతోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణే... గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడులో మారిన స‌మీక‌ర‌ణాలు. ఈ నియోజ‌క‌వ‌ర్గం మొన్న‌టి వ‌ర‌కూ కాపు వ‌ర్గానికి చెందిన కావ‌టి మ‌నోహ‌ర్‌ నాయుడుని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దానికి త‌గిన‌ట్లుగా ఆయ‌న కూడా బ‌ల‌ప‌డుతూ ప‌ట్టు సంపాదించారు. కానీ.. చివ‌రి నిమిషంలో ఆ సీటును నంబూరి శంక‌ర్‌ రావు అనే క‌మ్మ సామాజిక‌ వ‌ర్గ నేత‌కు క‌ట్ట‌బెట్టారు. ఎందుకంటే.. అక్క‌డ టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ బ‌రిలో ఉన్నారు. కుల స‌మ‌తుల్య‌త కోసం ఇలా చేశామంటూ వైసీపీ చెబుతోంది. ఇక ఈ స‌మీక‌ర‌ణ‌ల‌కు పెట్టింది పేరైన టీడీపీ కూడా... గుడివాడ‌లో త‌న అసలు రంగును బ‌య‌ట‌పెట్టుకుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీకొట్టేందుకు ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు చాలా మందే ఉన్నా.. నాని సామాజిక వ‌ర్గానికి చెందిన దేవినేని అవినాశ్ నే బ‌రిలోకి దింపుతోంది. మొత్తంగా ఈ రెండు పార్టీల‌తో పాటు మిగిలిన చిన్నా చిత‌కా పార్టీలు కూడా కులాల కుంప‌ట్ల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నాయి.