Begin typing your search above and press return to search.

ఐఐటీ మ‌ద్రాస్‌లో కుల వివ‌క్ష‌.. ఏకంగా మోడీకి లేఖ‌.. ఎవ‌రంటే!

By:  Tupaki Desk   |   5 Feb 2022 10:42 AM GMT
ఐఐటీ మ‌ద్రాస్‌లో కుల వివ‌క్ష‌.. ఏకంగా మోడీకి లేఖ‌.. ఎవ‌రంటే!
X
ప్ర‌తిష్టాత్మ‌క ఐఐటీ మ‌ద్రాస్‌లో కుల వివ‌క్ష ఎక్కువ‌గా ఉంద‌ని.. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణ ఆధిప‌త్య ధోర‌ణుల‌తో ఇక్క‌డ వాతావ‌ర‌ణం క‌లుషితం అయింద‌ని ఆరోపిస్తూ.. ప్రొఫెస‌ర్ ఒక‌రు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ సంధించారు. దీనిపై విచార‌ణ చేయాల‌ని.. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని..లేకుంటే తాను ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతాన‌ని కూడా ఆ ప్రొఫెస‌ర్ హెచ్చ‌రించారు. అంతేకాదు. త‌న ఆరోపణలపై జాతీయ బీసీ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దర్యాప్తు చేయించకపోతే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు మ‌రింత‌గా క‌ల‌క‌లం రేపుతున్నాయి. విష‌యం ఏంటంటే.. కేర‌ళ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ విపిన్ పి. వీటిల్.. ఐఐటీ మ‌ద్రాస్‌లో ప్రొఫెస‌ర్‌. హ్యూమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ స‌బ్జెక్టుల‌ను ఆయ‌న బోధిస్తారు. ఈయ‌న మనియని సామాజిక వర్గానికి చెందినవారు. ఇది కేరళలో ఓబీసీ కిందకు వస్తుంది. జూలై 2021లో ఇలాంటి కుల వివక్షను ఎదుర్కోవడంతో ఆయన ఐఐటీ మద్రాస్‌ను వీడారు. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ నెలలో తిరిగి విధుల్లో చేరారు.

అయితే ఈ వివక్ష ఇంకా కొనసాగుతూ ఉండటంతో ఆవేదన చెందిన ప్రొఫెసర్ వీటిల్ మరోసారి రాజీనామా చేశారు. "కుల వివక్షపై పోరాటం చేసినందుకు గాను అప్పటి ఐఐటీ మద్రాస్ డైరెరక్టర్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డైరెక్టర్ నన్ను కులం పేరుతో పలురకాలుగా వేధించారు`` అని ఇటీవల ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. అగ్రకులాలకు చెందిన వారు తక్కువ కులాల వారిని ఒక మనిషిగా చూడరు సరికదా.. వారిని ప్రశాంతంగా ఉండనీయరు. అంతేకాదు మా పని మేమే చేసుకుపోతామంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు" అని వీటిల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌లో ఐఐటీ మద్రాస్ వీటిల్ ఆరోపణలపై విచారణ కమిటీని నియమించింది. దర్యాప్తు చేసిన విచారణ కమిటీకి వీటిల్ ఆరోపణలపై ఎలాంటి నిర్దిష్ట రుజువులు లేదా సాక్ష్యాలు లభించలేదు. మరి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.