Begin typing your search above and press return to search.

కుల వృత్తికి గోవిందా కొడుతున్న వైసీపీ...బీసీలకు దెబ్బేనా...?

By:  Tupaki Desk   |   24 Nov 2022 11:30 AM GMT
కుల వృత్తికి గోవిందా కొడుతున్న వైసీపీ...బీసీలకు దెబ్బేనా...?
X
కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా అని ఒక పాత పాట ఉంది. నిజానికి ఈ రోజు సమాజంలో కులాలు అన్నీ వృత్తుల వల్లనే వచ్చాయని చరిత్ర చెబుతోంది. తమ తమ వృత్తులలో రాణిస్తూ పొట్ట నింపుకుంటూ సమాజ హితానికి ఆనాడు అంతా పాటుపడేవారు. అయితే ఈ రోజున ఎంతలా చదువులు చదివినా ఉన్నత విద్యను అభ్యసించినా కుల వృత్తులకు కూడా చేసుకుంటూ ఉండేవారు అనేక మంది కనిపిస్తారు. నిజానికి ఈ దేశంలో సప్రదాయ వృత్తులు చేసేవారే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు.

వారికి ప్రభుత్వాలు ఎటూ ఉపాధిని చూపించలేవు. కానీ వారి వృత్తులకు ఇబ్బంది లేకుండా పాలన చేస్తే అంతే చాలు అనుకునే పరిస్థితి. అయితే ఇపుడు అంతా తారు మారు అవుతోంది. కుల వృత్తులకు గండి పెడుతూ దాన్ని ప్రగతి అని చెప్పుకుంటున్నారు. ఒక నాడు రజక కులస్థులు ఉండేవారు. వారి ఉపాధిని కొట్టేలా పెద్ద ఎత్తున లాండ్రీ షాప్స్ వచ్చి చేరాయి. అలాగే పాల వ్యాపారం కార్పొరేట్ స్థాయికి చేరింది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకే పరిమితం అయిన చేపల అమ్మకాలను రిటైల్ అవుట్ లెట్స్ గా ముందుకు తెచ్చి అన్ని వర్గాల వారికి అందులో అవకాశం కల్పించారు. దాంతో ఆ వృత్తిని నమ్ముకున్న వారంతా ఇపుడు లబోదిబోమంటున్నారు. అయినా సరే ప్రభుత్వం అది తాము సాధిస్తున్న అభివృద్ధిగా చెప్పుకుంటూ వస్తోంది.

ఇపుడు చూస్తే నాయీ బ్రాహ్మణ మీదకు వ్యవహారం వచ్చింది. నాయీ బ్రాహ్మణులు తమ సెలూన్ దుకాణాలను గల్లీలో ప్రతీ చోటా ఏర్పాటు చేసుకుని తమ పొట్ట తాము పోసుకుంటున్నారు. ఇపుడు ఆ వృత్తిని కూడా కార్పోరేట్ బిజినెస్ సెక్టార్ లోకి తీసుకురావడానికి ఏపీ సర్కార్ చూస్తోంది. రియలెన్స్ సంస్థకు ఈ బిజెనెస్ ని కేటాయించారని అంటున్నారు. దీని వల్ల భారీ బడ్జెట్ తో రిలయెన్స్ సెలూన్ షాపులు తెరిస్తే దాని మీదనే అధారపడి సంప్రదాయ జీవితాన్ని సాగించే నాయీ బ్రాహ్మణులు ఏమైపోవాలి అన్న ప్రశ్న ముందుకు వస్తోంది.

ఈ విషయంలో నాయీ బ్రాహ్మణులు చాలా సతమతమవుతున్నారు. తన వృత్తిలోకి కార్పోరేట్ సెక్టార్ ని ఎలా తీసుకువస్తారు అంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లడంలేదు. భారీ ఎత్తున రిలయెన్స్ సెలూన్ షాపులను తెరిస్తే వారి వద్ద కూలీలుగా నాయీ బ్రాహ్మణులు చేరిపోవాల్సి ఉంటుంది తప్ప మరో దిక్కు లేకుండా పోతుందని అంటున్నారు.

దీని మీద గత కొద్ది రోజులుగా నాయీ బ్రాహ్మణులు ఏపీలో ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. అసలు రిలయెన్స్ మీద ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారు అని కూడా అంటున్నారు. ఒకనాడు తన తండ్రిని చంపించిన సంస్థ అన్నట్లుగా దాడులు కూడా చేయించిన సంస్థకు ఇపుడు వైసీపీ అధికారంలోకి రాగానే వారికే పెద్ద పీట వేస్తున్నారు. ఏకంగా పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చారు.

దానికి తోడుగా వ్యాపారాలలో అవకాశాలు కల్పిస్తున్నారు. ఇపుడు బీసీల పొట్ట కొట్టే విధంగా చర్యలను తీసుకుంటున్నారు. ఇదేమిటి అంటే మత్రం సరైన సమాధానం మాత్రం వైసీపీ పెద్దల వద్ద లేదు అంటున్నారు. మరి ఈ విషయం మీద విపక్షాలు అయినా ఆందోళన చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి. మాది బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోంది అంటే మొర ఆలకించకపొవడం విడ్డూరమే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.