Begin typing your search above and press return to search.

కులానికో సంఘం!..అమెరికాలో 'కుల‌' క‌లం!

By:  Tupaki Desk   |   1 July 2018 2:30 PM GMT
కులానికో సంఘం!..అమెరికాలో కుల‌ క‌లం!
X
భార‌త దేశంలో చాలా విష‌యాల్లో అన్ని దేశాల కంటే కూడా అగ్ర‌గ‌ణ్య దేశంగా క‌నిపించినా... మ‌న సామాజిక వ్య‌వ‌స్థ‌లో పాతుకుపోయిన కులం విష‌యంలో మాత్రం చాలా దేశాల కంటే కూడా వెనుకబ‌డి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. హిందూ దేశమైన భార‌త్ లో లెక్క‌లెన‌న్ని కులాలు కొన‌సాగుతున్నాయి. అది కూడా ఇత‌ర మ‌తాల‌ను వ‌దిలేస్తే... ఒక్క హిందూ మతంలోనే ఈ కులాల‌న్నీ ఉన్నాయి. హైంద‌వ ధ‌ర్మంలో ఆయా ప‌నుల‌కు ఆయా వ‌ర్గాలు అని ఏర్పాటు కాగా... ఆ వ‌ర్గాల‌న్నీ కూడా ఆ త‌ర్వాతి కాలంలో కులాలుగా మారిపోయాయి. ఆ కులాల‌కు చెందిన ఆచార వ్య‌వ‌హారాల‌ను అనాది నుంచి బాగా ఒంట‌బ‌ట్టించుకున్న కొన్ని అగ్ర‌కులాలు... ఆ ఆచారాల‌ను ఇప్ప‌టికీ పెంచి పోషిస్తూనే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌నుషులంతా స‌మాన‌మేన‌ని హిందూ ధ‌ర్మంతో పాటు ఇత‌ర అన్ని మ‌తాల‌కు చెందిన గ్రంథాల‌న్నీ చెబుతున్నా కూడా హిందూ మ‌తానికి చెందిన అగ్ర‌వ‌ర్ణాల్లో మాత్రం ఈ మార్పు రావ‌డం లేదు. అయితే విద్య లేని మ‌నుషులు ఆ ఆచారాల‌ను పాటించార‌ని, విద్యతో ఈ అస‌మాన‌త‌లు అన్ని ప‌టాపంచ‌లు అయిపోతాయ‌ని చాలా మంది సంఘ సంస్క‌ర్త‌లు భావించారు. అయితే విద్య అన్ని వ‌ర్గాల‌కు అందుతున్నా కూడా కులాల అస‌మాన‌త‌లు మాత్రం తొల‌గిపోవ‌డం లేద‌న్న భావ‌న చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

అయినా విద్యాధికులుగా మారుతున్న మ‌న యువ‌త‌రం అయితేనేమీ, యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాల్సిన మ‌న పెద్ద‌లైతేనేమీ చేస్తున్న‌దేమిటంటే... కుల విద్వేషాల‌ను రెచ్చగొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకోవ‌డం. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... విద్య‌, ఉపాధి నిమిత్తం విదేశాల‌కు వెళ్లిన మ‌న తెలుగోళ్లు... అక్క‌డ కులాల‌కు పాడె క‌ట్ట‌డం మానేసి... కుల విద్వేషాల‌ను పెంచి పోషిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కో కులానికి చెందిన వారంతా ఒక్కో ద‌రిన చేరి... ఒక్కో కులానికి ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ త‌ర‌హా వైచిత్రి ఇత‌ర దేశాల్లో కంటే... మ‌న తెలుగోళ్లే అధికంగా ఉంటున్న అగ్ర‌రాజ్యం అమెరికాలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అమెరికాలో ఈ జాడ్యం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది అనే కంటే కూడా అక్క‌డ మ‌న కుల జాడ్యం వెర్రి త‌ల‌లు వేస్తోంద‌ని చెబితే బాగుంటుందేమో. నిజ‌మే ఇప్పుడు అమెరికాలో స్థిర‌ప‌డ్డ మ‌న తెలుగోళ్ల‌కు సంబంధించి లెక్క లేన‌న్ని సంఘాలు ఏర్ప‌డ్డాయి. ఆ సంఘాలు ఏర్ప‌డ్డ తీరు, వాటి వ్య‌వ‌హార స‌ర‌ళిని నిశితంగా ప‌రిశీలించిన ఎవ‌రికైనా... వాటి ఉద్దేశ్యం, ల‌క్ష్యం ఏమిటో ఇట్టే అర్థం కాక మాన‌దు. మొత్తంగా ఇత‌ర కులాల కంటే త‌మ కుల‌మే అధిక‌మైన‌ది అన్న భావ‌నే అక్క‌డి మ‌న తెలుగోళ్ల‌ను ఇలాంటి పెడ‌తోవ‌లు ప‌ట్టిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టికి మొన్న ఓ సంఘం... ఏదో వీకెండ్ పేరు చెప్పి... త‌మ కులానికి చెందిన వారంద‌రినీ ఓ చోట చేర్చేందుకు య‌త్నించింది. ఆ య‌త్నం తెలుగు మీడియాకు దొరికిపోవ‌డంతో ఆ య‌త్నాలు అప్ప‌టిక‌ప్పుడు కాస్తంత స‌ద్దుమ‌ణిగినా... మ‌నోళ్ల‌లోని కుల పిచ్చి మాత్రం కించిత్ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఇటీవ‌లి ప‌రిణామాలు చెబుతున్నాయి.

టాలీవుడ్ కు చెందిన ప‌లువురు హీరోయిన్లు, బుల్లితెర న‌టీమ‌ణుల‌ను అమెరికా ర‌ప్పించి వారితో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డ‌టం - ఈ త‌ర‌హా దుశ్చ‌ర్య‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ఫుల్ స్టాప్ పెట్ట‌డం మాని... మా వ‌ర్గానికి చెందిన వారికి ఈ దందాతో ప్ర‌మేయం లేద‌ని చెప్పేందుకు చాలా సంఘాలు య‌త్నిస్తుండ‌టం నిజంగానే బాధ క‌లిగించే విష‌యమే. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలించి చూస్తే... కుల జాడ్యంతో ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్టుబాట్లు పెట్టుకుని బ‌తుకుతున్న మ‌న కంటే కూడా అమెరికాలోని మ‌నోళ్లు... మ‌న‌ల్ని మించిపోయార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా విద్య కులం అడ్డుగోడ‌ల్ని బ‌ద్ద‌లు కొడుతుంద‌న్న మాట‌ను మ‌న తెలుగు ఎన్నారైలు బ‌ద్ద‌లు కొట్టేశారు. మ‌న‌కంటే కూడా కుల‌గ‌జ్జిని బాగా అంటించేసుకున్న వాళ్లుగా ముద్ర వేసుకున్నారు. దీనంత‌టికీ కార‌ణంగా ఒకే మాట వినిపిస్తోంది. అదే... ఇత‌ర కులాల కంటే మ‌న‌మే అధికులమ‌న్న భావ‌న‌. మ‌రి ఈ భావ‌న ఎప్పుడు అంత‌రిస్తుందో, దేశం కాని దేశం వెళ్లిన మ‌నోళ్లంతా ఎప్పుడు క‌లిసి ముందుకు సాగుతారో?