Begin typing your search above and press return to search.

కృష్ట కిశోర్ కేసులో...జగన్ సర్కారుకు షాక్ తగిలిందే

By:  Tupaki Desk   |   31 Jan 2020 5:02 PM GMT
కృష్ట కిశోర్ కేసులో...జగన్ సర్కారుకు షాక్ తగిలిందే
X
ఐఆర్ ఎస్ అధికారి కృష్ణ కిశోర్ కేసు విషయంలో తాజాగా ఏపీ సర్కారుకు పెద్ద షాకే తగిలింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కృష్ణ కిశోర్ పై సస్పెన్షన్ వేటు వేసిన జగన్ సర్కారు... ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టులను ఆశ్రయించిన కృష్ణ కిశోర్... తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయించుకోవడంతో పాటుగా వేతనం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ (క్యాట్) జగన్ సర్కారుకు మరో షాకిచ్చింది. కృష్ణ కిశోర్ కు బకాయి పడ్డ వేతనాలను రెండు రోజుల్లోగా విడుదల చేయాలని గత నెల 24న తాము జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో మరింత జాప్యం చేస్తే... ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారణకు పిలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వెరసి జగన్ సర్కారుకు క్యాట్ లో గట్టి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పక తప్పదు.

చంద్రబాబు హయాంలో ఏపీ ఎకనమిక్ ఫోరం సీఈఓగా పనిచేసిన కృష్ణ కిశోర్.. ఏపీ ప్రభుత్వ పెద్దల విదేశీ పర్యటనల్లో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. సీఎం హోదాలో చంద్రబాబు సహా మంత్రులు నారా లోకేశ్ తదితరులు విదేశాల్లో జరిపిన పర్యటనల్లో కృష్ణ కిశోర్ అన్నీ తానే వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎకనమిక్ ఫోరం తరఫున పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగా... చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అదే సమయంలో వైసీపీ ఘనవిజయంతో ఏపీకి కొత్త సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కృష్ణ కిశోర్ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తేల్చిన జగన్ సర్కారు... ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటుగా ఆయన ద్వారా జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ పూర్తయ్యేదాకా అమరావతిని విడిచి వెళ్లరాదని కూడా ఆయనకు షరతులు పెట్టింది.

ఈ క్రమంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించిన కృష్ణ కిశోర్... తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కనీసం తనకు ఏ రకమైన పోస్టు కూడా ఇవ్వలేదని విన్నవించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్... కృష్ణ కిశోర్ కు తక్షణమే బకాయి పడ్డ వేతనాన్ని విడుదల చేయాలని డిసెంబర్ 24ననే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేవలం కృష్ణ కిశోర్ కు వేతనం ఇచ్చేందుకే సాధారణ పరిపాలనా శాఖలో ఓ కొత్త పోస్టును సృష్టించిన ప్రభుత్వం... వేతనం విడుదలలో మాత్రం జాప్యం చేసింది. దీనిపైనా కృష్ణ కిశోర్ క్యాట్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారించిన క్యాట్... కృష్ణ కిశోర్ కు వేతనం విడుదలలో జాప్యం చేస్తే నేరుగా సీఎస్ ను విచారణకు పిలవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యాట్ ఆగ్రహం నేపథ్యంలో శుక్రవారమే కృష్ణ కిశోర్ కు బకాయి వేతనాలను జగన్ సర్కారు విడుదల చేసింది.