Begin typing your search above and press return to search.

కావేరీ వివాదంః అస‌లేం జ‌రిగిందంటే.....

By:  Tupaki Desk   |   13 Sep 2016 5:08 AM GMT
కావేరీ వివాదంః అస‌లేం జ‌రిగిందంటే.....
X
కావేరీ నదీ జలాల వివాదం.. త‌మిళ‌నాడు - క‌ర్ణాట‌క‌ల మ‌ధ్య ఉన్న ఈ న‌ది నీటి వ్య‌వ‌హారం ఇపుడు ఆ రాష్ట్రాల మ‌ధ్య నిప్పుర‌వ్వ‌ల‌ను రాజేస్తోంది. అయితే ఈ వివాదం ఈ నాటిదికాదు. కావేరీ నదీ జలాల వివాదం 1892లో మైసూరు - మద్రాసు ప్రావిన్సుల మధ్య తొలిసారిగా తలెత్తింది. ఆ సమయంలో మైసూరు ప్రాంతం రాజుల ఆధీనంలో ఉండగా - మద్రాసు ప్రావిన్సు బ్రిటీషర్ల చేతిలో ఉంది. నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించగా, అందుకు మద్రాసు ప్రావిన్సు విబేధించింది. దీంతో మద్రాసు ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా మైసూరు కావేరీ నదిపై ప్రాజెక్టులు చేపట్టేలా ఇరు ప్రావిన్సుల మధ్య ఒప్పందం కుదిరింది.

1910లో కావేరీ నదిపై కన్నాంబడి గ్రామం వద్ద 41.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును నిర్మించేందుకు మైసూరు రాజు కృష్ణరాజ ఒడయార్ - ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వయ్య ప్రణాళికలు రూపొందించారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించిన వారు తొలి దశలో భాగంగా 11 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. రెండో దశ కోసం సిద్ధపడుతున్న తరుణంలో తాము మెట్టూరు డ్యాం నిర్మించుకుంటున్నందున.. రెండో దశ పనులు చేపట్టవద్దని మద్రాసు అడ్డుచెప్పింది. భారత ప్రభుత్వ సహకారంతో మైసూరు ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ - నిల్వ సామర్థ్యం మాత్రం 11 టీఎంసీలకే పరిమితం కావాల్సి వచ్చింది. మైసూరు ఇందుకు అంగీకరించినప్పటికీ - పాత ప్రణాళిక ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. మద్రాసు ఈ విషయాన్ని గుర్తించడంతో వివాదం మొదలైంది. దీంతో 1892 నాటి ఒప్పందం మేరకు మధ్యవర్తిత్వానికి నాటి బ్రిటిష్ ఇండియా సిఫారసు చేసింది. హెచ్.డి.గ్రిఫిన్ మధ్యవర్తిగా - ఎం.నీథ ర్‌సోల్ మదింపుదారుగా నియమితులయ్యారు. 1914లో వారు మైసూరుకు అనుకూలంగా తీర్పువెలువరించారు. దీంతో 11 టీఎంసీల సామర్థ్యంతో మైసూరు డ్యాం నిర్మించుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయం మద్రాసుకు రుచించలేదు. 1924 నాటికి 50 ఏళ్లపాటు వర్తించేలా ఇరు ప్రావిన్సులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దేశానికి స్వాత్రంత్యం వచ్చాక 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించారు. దీంతో మైసూరు - మద్రాసు ప్రావిన్సుల స్థానంలో కావేరీ పరివాహక ప్రాంతంలో కర్ణాటక - తమిళనాడు - కేరళ రాష్ట్రాలు ఏర్పటయ్యాయి. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైంది. దీంతో కావేరి ప్రధాన ఉపనదుల్లో ఒకటైన కాబిని జన్మస్థలం కేరళ కావడంతో కావేరీ జలాల్లో ఆ రాష్ట్రానికి కూడా వాటా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కావేరీ నది సముద్రంలో కలిసే ముందు పుదుచ్చేరి మీదుగా ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలు కూడా తాగు - సాగు నీటి అవసరాల కోసం కావేరీపై ఆధారపడుతున్నారు.

1997 తర్వాత భారత ప్రభుత్వం కావేరీ రివర్ అథారిటీ - కావేరీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 2002లో కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు సంభవించింది. దీంతో ఇరు రాష్ట్రాల్లోని డ్యాముల్లో నీరు అట్ట డుగు స్థాయికి చేరింది. 2002లో కావేరీ రివర్ అథారిటీ సమావేశం నిర్వహించగా - తమిళనాడు సీఎం జయలలిత వాకౌట్ చేశారు. కాగా తాజాగా తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. దీంతో కన్నడ ప్రాంతాల్లో ఆందోళనలు తలెత్తాయి. అలాగే కర్ణాటకలో తమిళ ఛానళ్ల ప్రసారాలను నిషేధించారు. తమిళ సినిమాలను సైతం నిషేధించారు. తమిళనాడు వాహనాలు తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘ‌ర్షణ వాతావ‌ర‌ణం ఇంకా కొనసాగుతూనే ఉంది.