Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్యకేసులో సిబిఐ దూకుడు !

By:  Tupaki Desk   |   11 Jun 2021 11:30 AM GMT
వైఎస్ వివేకా హత్యకేసులో సిబిఐ దూకుడు !
X
మాజీ మంత్రి దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. గత నాలుగు రోజులుగా అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు, జిల్లా స్థాయి అధికారిని కూడా పిలిపించి విచారించారు. అనుమానాస్పద వాహనం వివరాలు, హత్య జరిగిన తర్వాత ఫోటోలు ఎవరు తీసారనే అంశంపై ప్రశ్నించారు. ఐదోరోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ జరుపుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరసగా ఐదోరోజు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతనితోపాటు వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ కూడా వరసగా మూడు రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరగడానికి 15 రోజుల ముందు కిరణ్ కుమార్ యాదవ్ వివేకాను కలిసినట్లు సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది.

వివేకా హత్య కేసు విచారణలో ఇప్పటివరకు సీబీఐ అధికారులు కడప జిల్లాలో ఐదు సార్లు పర్యటించారు. అయితే రెండు సార్లు కరోనా కారణంగా సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజుల క్రితం కడప జిల్లాకు చేరుకున్న ఏడుగురు సీబీఐ అధికారుల బృందం పలువురిని విచారించే పనిలో నిమగ్నమైంది. సీబీఐ అధికారులు ప్రధానంగా ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో దస్తగిరిని 40 రోజులు విచారించిన అధికారులు.. మళ్లీ కడపలో జరుగుతున్న విచారణకు సైతం దస్తగిరిని పిలిచారు. రెండో రోజు డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనాయతుల్లాను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆ దిశగా సీబీఐ విచారణ కొనసాగుతోంది.

మరో, సీబీఐ బృందం పులివెందులలోని సునీల్ కుమార్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ ఇద్దరూ అన్నదమ్ములు. సునీల్ కుమార్ యాదవ్ వివేకాకు అత్యంత సన్నిహితుడు కావడంతో సీబీఐకి ఉన్న అనుమానాలతో సోదరులిద్దరినీ విచారిస్తోంది. దీంతోపాటు రవాణశాఖ అధికారులు కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు అనుమానాస్పద వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. 2019 మార్చిలో వివేకా హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో వైఎస్ వివేకా మృత‌దేహాన్ని తొలుత ఇద‌య‌తుల్లా త‌న ఫోన్‌లో ఫొటోలు తీసిన‌ట్లు అధికారుల వ‌ద్ద ప్రాథ‌మిక స‌మాచారం ఉంది. ఈ నేప‌థ్యంలో హ‌త్య జ‌రిగినప్పుడు ఇంట్లో ఎవ‌రెవ‌రు ఉన్నారు, బాత్‌ రూమ్ నుంచి వివేకా మృత‌దేహాన్ని బెడ్‌ రూమ్‌ లోకి ఎవ‌రు త‌ర‌లించార‌నే త‌దిత‌ర విష‌యాల‌పై అధికారులు విచార‌ణ చేస్తున్నారు.