Begin typing your search above and press return to search.

వివేక హత్య కేసులో కీలక నిందుతుడ్ని గోవాలో అరెస్టు చేసిన సీబీఐ!

By:  Tupaki Desk   |   3 Aug 2021 4:06 AM GMT
వివేక హత్య కేసులో కీలక నిందుతుడ్ని గోవాలో అరెస్టు చేసిన సీబీఐ!
X
దివంగత మహానేత వైఎస్ సొంత సోదరుడు వైఎస్ వివేకను ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హతమార్చిన వైనం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి కారణమైన వారు ఎవరన్నది అందరిని తొలిచేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకోవటం కానీ అరెస్టు చేయటం కానీ జరగలేదు. తన సొంత బాబాయ్ ను హత్య చేసిన వైనానికి సంబంధించి ఎవరిని అరెస్టు చేయకపోవటం.. హత్య జరిగిన ఇంత కాలానికి కూడా కారణం ఏమిటన్నది ఛేదించకపోవటంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ విమర్శల్ని ఎదుర్కొంటుంటారు. హైకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసు దర్యాప్తును షురూ చేసిన సీబీఐ.. కరోనా కారణంగా విచారణను కొంతకాలం ఆపటం తెలిసిందే.

ఈ మధ్యనే విచారణణు మళ్లీ ఆరంభించారు. ఈసారి వారు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ ను తాజాగా సీబీఐ అధికారులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వివేక హత్య కేసులో ఇదో కీలక పరిణామంగా చెప్పక తప్పదు. ఈ మధ్యన సీబీఐ అధికారులు విచారణ పేరుతో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు చేసిన సునీల్.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికి అతడికి బెయిల్ మంజూరు కాలేదు.

అనంతరం తన ఇంటికి తాళం వేసిన సునీల్.. కుటుంబంతో సహా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. అతడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీబీఐ.. ఎట్టకేలకు అతగాడిని గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. కొందరు మాత్రం అరెస్టు చేశారని చెబుతున్నారు. సీబీఐ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.

ఇంతకాలం తర్వాత వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవటంతో పాటు.. తొలి అరెస్టు జరిగినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వివేక హత్య కేసును తేల్చాలన్న పట్టుదలతో సీబీఐ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివేక హత్య కేసును ఎవరూ ఎందుకు తేల్చటం లేదన్న అనుమానం కాస్త తగ్గేలా తాజా పరిణామం ఉందని చెప్పాలి.