Begin typing your search above and press return to search.

‘‘సామాన్యుడికి’’ మోడీ మార్క్ షాక్

By:  Tupaki Desk   |   5 July 2016 5:21 AM GMT
‘‘సామాన్యుడికి’’ మోడీ మార్క్ షాక్
X
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా.. కేంద్ర.. రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష పోరు ఢిల్లీలో కనిపిస్తుంది. ఢిల్లీలో కొలువు తీరిన మోడీ సర్కారుకు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సర్కారు మధ్య సాగే ప్రత్యక్ష పోరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు.. ఏ మాత్రం తగ్గకుండా ఒకరిని ఒకరు దెబ్బేసుకునే కార్యక్రమం మొదటి నుంచి నడుస్తున్నదే. ఇలా ఇద్దరూ ఇద్దరే అన్న చందంగా నడుస్తున్న ఈ పోరులో తాజా దెబ్బ కేజ్రీవాల్ సర్కారుకు తగిలిందని చెప్పాలి.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న రాజేంద్రకుమార్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. గత సంవత్సరం ఢిల్లీ సెక్రటేరియట్ లో సీబీఐ సోదాలు నిర్వహించటం తెలిసిందే. ఆ సమయంలో తన అనుమతి లేకుండా సీబీఐ అధికారులు ఢిల్లీ సచివాలయం నుంచి ఫైల్స్ తీసుకెళ్లటంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా తప్పు పట్టారు.

మోడీ సర్కారు మీద విరుచుకుపడుతూ.. తమపై కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే ఇలాంటి చేష్టలు చేస్తున్నారంటూ మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజేంద్ర కుమార్ ఎలాంటి తప్పులు చేయకున్నా.. తన మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనపై ఈ తరహా దాడులు చేస్తున్నారంటూ అప్పట్లో వెనకేసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలపై ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. తన వరకు తాను ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత దిగజారిపోవటం తాను చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం.