Begin typing your search above and press return to search.

రోటామాక్ అధిప‌తిని లోప‌లేశారు

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:00 AM GMT
రోటామాక్ అధిప‌తిని లోప‌లేశారు
X
వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకుల ద‌గ్గ‌ర నుంచి అప్పుగా తీసుకోవ‌టం.. ద‌ర్జాగా ఫోజులు కొట్ట‌టం.. మంచి మ‌హుర్తం చూసుకొని ఫారిన్ కు చెక్కేయ‌టం ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. పావ‌లా.. అర్థ‌రూపాయి బ్యాంకుల్లో దాచుకున్నోళ్లు త‌మ డ‌బ్బు కోసం బ్యాంకు వెళితే.. నేర‌స్తుల మాదిరి రూల్స్ తో చుక్క‌లు చూపించే బ్యాంక్ అధికారులు.. బ‌డా బాబుల‌కు మాత్రం వేలాది కోట్ల రూపాయిలు ఇచ్చేస్తుంటారు.

నీర‌వ్ మోడీ ఎపిసోడ్ బ‌య‌ట‌కు వ‌చ్చాక.. ఆ హ‌డావుడిలో అంద‌రూ ఉన్న వేళ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించ‌ని రోటామాక్ పెన్నుల కంపెనీ అధినేత విక్ర‌మ్ కొఠారి ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు రూ.3695 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న అత‌గాడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించ‌టం లేదు.

మాల్యా.. నీర‌వ్ మోడీ ఉదంతాల‌తో అలెర్ట్ అయ్యారేమో కానీ.. విచార‌ణ కోసం విక్ర‌మ్ ను ఆయ‌న కుమారుడు రాహుల్ ను త‌మ కార్యాల‌యానికి పిలిపించిన సీబీఐ.. వారిని అరెస్ట్ చేసింది. త‌మ విచార‌ణ‌కు వీరిద్ద‌రూ స‌హ‌క‌రించ‌టం లేద‌ని చెప్పిన సీబీఐ.. ఇరువురిని అదుపులోకి తీసుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

అప్పుడెప్పుడో 2008లో రొటామాక్ తీసుకున్న అప్పుల‌కు వ‌డ్డీలు క‌లిపితే ఆ మొత్తం రూ.3695 కోట్లకు చేరుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. మ‌రోవైపు.. ఈ కంపెనీకి ఐటీ పోటు మొద‌లైంది. త‌మకు చెల్లించాల్సిన ప‌న్నును క‌ట్ట‌లేద‌ని.. ఎగ‌వేసిన‌ట్లుగా ఐటీ విభాగం చెబుతోంది. ప‌న్ను ఎగ‌వేతకు ఎందుకు పాల్ప‌డ్డారో చెప్పాలంటూ వివ‌ర‌ణ కోరుతోంది. 2008లో తీసుకున్న అప్పుడు 2018 వ‌ర‌కూ తీర్చ‌కుండా ఉంటే ఎందుకు ఊరుకున్న‌ట్లు? దీనికి బాధ్య‌త ఎవ‌రిది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా.. ఎన్ని పెన్నులు క‌లిపితే రూ.3695 కోట్లు అవుతుందంటారు?