Begin typing your search above and press return to search.

బ్యాంకుల‌కు 1700 కోట్ల‌ కుచ్చుటోపీ!

By:  Tupaki Desk   |   28 Sep 2018 8:39 AM GMT
బ్యాంకుల‌కు 1700 కోట్ల‌ కుచ్చుటోపీ!
X
కేంద్ర‌ ప్ర‌భుత్వం గ‌తంలో చేప‌ట్టిన నోట్ల‌ర‌ద్దు, జీఎస్టీ వంటి చ‌ర్య‌ల‌తో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌ల‌బైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ఆర్థిక విధానాల వ‌ల్ల గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రూపాయి విలువ ప‌త‌న‌మ‌వ‌డంపై ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వీటికి తోడు బ్యాంకుల‌కు టోక‌రా ఇస్తున్న కంపెనీల వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిస్థితి మూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ చందంగా త‌యారైంది. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా - 13వేల కోట్ల రూపాయ‌లకు టోక‌రా వేసిన వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ - చోక్సీ....5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర....ఇలా రోజుకో అప్పుల ఎగ‌వేత‌ బాగోతం బ‌ట్ట‌బ‌య‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్ కు చెందిన విఎంసి సిస్టమ్స్‌ అనే సంస్థ....పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌ బి) నాయకత్వంలోని బ్యాంకులకు రూ.1,700 కోట్ల వ‌ర‌కు కుచ్చుటోపీ పెట్టిన వార్త తీవ్ర సంచ‌ల‌నం రేపుతోంది. పిఎన్‌ బి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)....ఆ కంపెనీపైనా - కంపెనీ డైరెక్ట‌ర్లు ఉప్పలపాటి హిమబిందు - ఉప్పలపాటి వెంకట రామారావు, భాగవతుల వెంకట రమణలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. విఎంసి సిస్టమ్స్‌ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు చేపట్టింది.

బిఎస్ ఎన్ ఎల్ తోపాటు వివిధ కంపెనీలకు ప‌రిక‌రాల‌ను విఎంసి సిస్ట‌మ్స్ సరఫరా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే 2009 ఆగస్టు 12న పిఎన్‌ బి - ఎస్‌ బిఐ - కార్పొరేషన్‌ బ్యాంక్‌ - ఆంధ్రా బ్యాంక్‌ - జెఎం ఫైనాన్షియస్‌ అసెట్స్‌ రీకన్‌ స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి రూ.1,010.50 కోట్లను విఎంసి రుణంగా తీసుకుంది. అయితే, కుంటిసాకులు చెబుతోన్న విఎంసి ...ఆ రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకులు ఆరా తీయ‌డంతో ఆ కంపెనీ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. బ్యాంకుల అనుమతి లేకుండానే 2014లో వేరే బ్యాంకు ఖాతాలకు రూ.43.83 కోట్ల మొత్తాన్ని ఆ కంపెనీ దారి మళ్లించినట్టు బ్యాంకులు గుర్తించాయి. దీంతో - సిబిఐకి పిఎన్‌ బి ఫిర్యాదు చేసింది. విఎంసి తీసుకున్న ...రూ.1,010.50 కోట్ల అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లు అయింది. పిఎన్‌ బికే రూ.539 కోట్లు - మిగతా బ్యాంకుల‌కు రూ.1,207 కోట్లు రావాల్సి ఉంది. ప‌లు కంపెనీల నుంచి త‌మ‌కు బ‌కాయిలు రావాల్సి ఉంద‌ని విఎంసి బుకాయించింది. అయితే, విచార‌ణ‌లో అటువంటిదేమీ లేద‌ని తేలింది. దీంతో ఆ బ్యాంకుల క‌న్సార్టియానికి లీడ్‌ బ్యాంక్‌ అయిన పిఎన్‌ బి....సిబిఐకి ఫిర్యాదు చేసింది. దీంతో, సీబీఐ అధికారులు...విఎంపి కంపెనీ - డైరెక్ట‌ర్ల ఇళ్ల‌లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు.