Begin typing your search above and press return to search.

చంద్రబాబు చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోందా?

By:  Tupaki Desk   |   4 Feb 2020 11:01 AM GMT
చంద్రబాబు చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోందా?
X
టీడీపీ అధినేత - ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోందన్న దిశగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పక తప్పదు. ఇటు రాజధాని అమారవతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలు... నిండు అసెంబ్లీలో ఎవరెవరు - ఎంతెంత మేర భూములను వెనకేసుకున్నారన్న వివరాలను వైసీపీ ప్రభుత్వం బయటపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం ఆరోపణలు చేసి వదిలేయకుండా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏకంగా సీఐడీని రంగంలోకి దించిన వైసీపీ... ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగా బాబుపైకి సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసే పనిని మొదలెట్టిందని చెప్పాలి. రాజకీయ వైరివర్గంగా వైసీపీ చేస్తున్న యత్నాలను అలా పక్కనపెడితే... గడచిన నాలుగైదు రోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించినా కూడా చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు తప్పదేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా తనదైన మార్కు దౌత్యంతో తనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. అవి దర్యాప్తు సంస్థల దాకా వెళ్లకుండా అడ్డుకోవడంలో నేర్పరిగా పేరున్న చంద్రబాబు... ఇప్పుడు తనపైకి సీబీఐని ఉసిగొల్పే యత్నాలను తిప్పికొట్టలేరా? అన్న వాదనలు ఉన్నా... గతంలో జరిగినట్టుగా ఇప్పటి పరిస్థితులు అంత ఈజీగా లేవన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా ఈ నాలుగైదు రోజుల్లో బాబు కొంప ముంచేసేలా ఏం పరిణామాలు చోటుచేసుకున్నాయన్న వివరాల్లోకి వెళితే... అమరావతి పరిధిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలను తవ్వి తీసిందట. ఆ ఆధారాలను చూపుతూ... ఇన్ ట్రేడింగ్ లో మనీ ల్యాండరింగ్ కార్యకలాపాలు కూడా జరిగి ఉంటాయన్న భావనతో... దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సీఐడీ లేఖ రాసిందట. సీఐడీ పంపిన ఆధారాలను పరిశీలించిన ఈడీ... ఈ వ్యవహారంపై మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన బృందాలను రంగంలోకి దించేందుకు ఈడీ రెడీ అయిపోయిందట.

ఓ వైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు చేసిన రోజే... అంటే సోమవారమే... లోక్ సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైసీపీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి... చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు చేయాలన్న విషయాన్ని సమగ్రంగా వివరించిన మిథున్ రెడ్డి... రాజధాని ఎక్కడ అన్న విషయంపై ప్రజలను ఏమార్చిన చంద్రబాబు తన అనుయాయులకు మాత్రం ముందే లీకులిచ్చి వేలాది ఎకరాల భూములను కారు చౌకగా కొట్టేశారని వివరించారు. ఇలా పేదల నుంచి టీడీపీ నేతలు, వారి బినామీలు కొల్లగొట్టిన భూములు 4 వేల ఎకరాలకు పైగానే ఉన్నాయని తమ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలోనే వివరాలు వెల్లడించిందని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు కర్త - కర్మ - క్రియ అంతా బాబేనంటూ మిథున్ రెడ్డి వైసీపీ వాదనను ఓ రేంజిలో వినిపించారు. ఈ వాదన విన్న ఎవరైనా కూడా చంద్రబాబు తప్పు చేశారని భావించక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

అంటే... ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థ సీఐడీని ఇన్ సైడర్ ట్రేడింగ్ దర్యాప్తులోకి దించేసిన జగన్ సర్కారు... అదే సీఐడీ లేఖలతో ఈడీని కూడా దర్యాప్తులోకి దింపేకడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఓ వైపు తీవ్ర ఆర్థిక నేరాలపై మాత్రమే దర్యాప్తునకు మొగ్గు చూపే ఈడీని అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ దర్యాప్తులోకి దిగిందంటేనే... సీఐడీ అందించిన ఆధారాలు వాస్తవాలేనని చెప్పక తప్పదేమో. అదే సమయంలో ఈ దర్యాప్తులను పార్లమెంటులో వివరిస్తూ.. చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు కూడా చేయించాల్సిందేనంటూ మిథున్ రెడ్డి తనదైన శైలి బలమైన వాదనను వినిపించడం చూస్తుంటే... త్వరలోనే చంద్రబాబుపై సీబీఐ విచారణకు రంగం సిద్ధమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో మచ్చ లేని నేతగా రాణించానని చెప్పుకుంటున్న చంద్రబాబు... తనపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు తన చుట్టూ బిగుసుకుంటున్న సీబీఐ దర్యాప్తును బాబు ఎలా తిప్పికొడతారో చూడాలి.