Begin typing your search above and press return to search.

డాక్టర్ సుధాకర్ కేసులో ట్విస్ట్: ఆయనపైనే సీబీఐ కేసు

By:  Tupaki Desk   |   3 Jun 2020 5:00 AM GMT
డాక్టర్ సుధాకర్ కేసులో ట్విస్ట్: ఆయనపైనే సీబీఐ కేసు
X
ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ప్రభుత్వం తొలగించిన డాక్టర్ సుధాకర్ కేసు చాలా మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో విచారణను వేగవంతం చేసింది. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు, కేజీహెచ్, మెంటల్ హాస్పిటల్ కు సంబంధించిన అధికారులను సీబీఐ ఇటీవలే విచారించింది. ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేసిన ఈ కేసులో సీబీఐ భారీ ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా డాక్టర్ సుధాకర్ పైనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ మేరకు సీబీఐ వెబ్ సైట్ లో ఆ వివరాలను పొందుపరిచడం సంచలనంగా మారింది.

డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సీబీఐ తాజాగా సుధాకర్ పై కేసు నమోదు చేసింది.

సుధాకర్ పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ ఇప్పటికే విశాఖలో కొందరు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు మొదట పోలీసులపై కేసు నమోదు కాగా.. తాజాగా బాధితుడు డాక్టర్ సుధాకర్ పైనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేవాడు. కరోనా సమయంలో ఆస్పత్రిలో మాస్కులు, పీపీఈ కిట్స్ లేవని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపించారు. దీంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విపక్షాలు దీనిపై ఆందోళన చేశాయి. ఈనెల 16న సుధాకర్ ను అరెస్ట్ చేయడం.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించి మెంటల్ ఆస్పత్రికి తరలించడం.. వీడియోలు వైరల్ కావడంతో కొందరు హైకోర్టుకు వెళ్లగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది.