Begin typing your search above and press return to search.

చందా కొచ్చ‌ర్ భ‌ర్త‌పై సీబీఐ విచార‌ణ‌!

By:  Tupaki Desk   |   31 March 2018 11:52 AM GMT
చందా కొచ్చ‌ర్ భ‌ర్త‌పై సీబీఐ విచార‌ణ‌!
X
వీడియోకాన్‌ గ్రూప్‌ నకు వేలకోట్ల రుణాలిచ్చి భారీ లబ్ది పొందారన్న ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ స‌త‌మ‌త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. 2012లో వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం ఇప్పించేందుకు చందా కొచ్చర్ సాయం చేసి ప్ర‌తిఫ‌లం పొందార‌న్న వార్త సంచ‌ల‌నం రేపింది. అయితే, క్విడ్ ప్రోకో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న చందా కొచ్చర్ కు ఐసీఐసీఐ బ్యాంకు డైరక్టర్ల బోర్డు బాసటగా నిలిచింది. అయితే, తాజాగా ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ విచార‌ణ చేపట్ట‌నుండ‌డం ఆసక్తిక‌రంగా మారింది. చందా కొచ్చర్‌ భర్త దీపక్ కొచ్చర్‌ - వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టేందుకు సీబీఐ సిద్ధ‌మైంది. ఆ వ్య‌వ‌హారానికి సంబంధించిన కొన్ని కీలకమైన‌ పత్రాలను పరిశీలిస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఒక‌వేళ ఆ ఆరోపణలు రుజువైతే నిందితులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు. అవ‌స‌ర‌మైతే దీపక్‌ కొచ్చర్ ను ప్రశ్నించే యోచ‌న‌లో సీబీఐ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్య‌వ‌హారంలో చందా కొచ్చర్‌ పేరును సీబీఐ ప్రస్తావించలేదు.

ఈ వ్య‌వ‌హారం సీబీఐ చేతికి వెళ్ల‌డంతో చందా కొచ్చ‌ర్ - దీపా కొచ్చ‌ర్ ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ఆమె ప్ర‌మేయం లేక‌పోయినప్ప‌టికీ ఆమె భ‌ర్త‌కు ల‌బ్ధి చేకూర్చింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి - వీడియోకాన్ కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌ - దీపక్‌ కొచ్చర్‌ - మరో ఇద్దరు బంధువులు 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. తనకు చెందిన ఓ సంస్థ ద్వారా ఆ కంపెనీకి ధూత్‌ రూ.64 కోట్లు రుణం ఇచ్చారు. అందులో యాజమాన్య హక్కులను రూ.9 లక్షలకే దీపక్‌ కొచ్చర్ కు చెందిన ట్రస్టుకు బదిలీ చేశారు. అయితే, వీడియోకాన్‌ గ్రూప్ రూ.3250 కోట్ల రుణం పొందిన 6 నెలల్లోనే ఈ బదిలీ జర‌గ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తీసుకున్ రుణంలో రూ.2,810 కోట్లు (దాదాపు 86 శాతం)ను వీడియోకాన్‌ తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో, 2017లో అది మొండి బకాయిగా మారింది. త‌న భ‌ర్త కోసం చందా కొచ్చ‌ర్....వీడియోకాన్ కు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రుణం ఇప్పించార‌ని - క్విడ్ ప్రోకోకు పాల్ప‌డ్డార‌ని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువుత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సీబీఐ ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నివేదిక కీల‌కం కానుంది.