Begin typing your search above and press return to search.

రఘురామకు మరో షాకిచ్చిన సీబీఐ

By:  Tupaki Desk   |   14 Aug 2021 2:27 AM GMT
రఘురామకు మరో షాకిచ్చిన సీబీఐ
X
ఏపీ సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక్క కారణంతో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ పక్క తనకు సీఎం జగన్ అంటే అమితమైన అభిమానం, గౌరవం అని చెబుతున్న రఘురామ, మరో పక్క విమర్శలు గుప్పిస్తూ రెండు నాల్కల ధోరణితో ఉన్న రఘురామ వైనంపై సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు. ఇక, తనకు ఏమాత్రం సంబంధం లేని జగన్ బెయిల్ రద్దు అంశంపై రఘురామ ఆసక్తి చూపడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి.

పనిలేని...అన్న సామెత చెప్పనట్లు రఘురామ వ్యవహార శైలి ఉందని వైసీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే, చివరకు జగన్ బెయిల్ రద్దు వ్యవహారం కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని సీబీఐ మెమో దాఖలు చేయడంతో రఘురామకు షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రఘురామకు సీబీఐ మరోసారి షాకిచ్చింది.

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ తమ అభిప్రాయాన్ని తేటతెల్లం చేసింది. విజయసాయి బెయిల్ ర‌ద్దు నిర్ణ‌యాన్ని కూడా కోర్టు విచక్షణకే వ‌దిలేస్తున్న‌ామని సీబీఐ మెమో దాఖలు చేసింది. నేడు జరిగిన విచార‌ణ‌లో నాంపల్లి సీబీఐ కోర్టుకు సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. సీబీఐ నిర్ణ‌యాన్ని కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయి వ్యవహారంలోనూ సీబీఐ...జగన్ పిటిషన్ తరహాలో నిర్ణయం తీసుకోవడంతో రఘురామకు షాక్ తగిలినట్లయింది. మరోవైపు, రఘురామకు చెందిన కంపెనీ రూ.829 కోట్ల అవకతవకలకు పాల్పడిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన నిర్మలా....ఆ అంశంపై ఫోకస్ చేస్తానని చెప్పడంతో రఘురామ ఇరకాటంలో పడ్డట్లయింది.