Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో మీడియాకు సీబీఐ నోటీసులు

By:  Tupaki Desk   |   22 Sep 2021 3:34 AM GMT
వివేకా హత్య కేసులో మీడియాకు సీబీఐ నోటీసులు
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. పీటముడిగా మారిన దివంగత మహానేత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకా దారుణ హత్య కేసుకు సంబంధించి తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసు లెక్క తేల్చేందుకు ఇప్పటికే పలువురిని విచారిస్తున్న సీబీఐ.. తాజాగా స్థానిక మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.

వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ అధికారుల ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు నోటీసులు పంపించిన వైనం స్థానిక మీడియా ప్రతినిధుల్లో కలకలాన్ని రేపింది. ఎందుకిలా? అంటే.. జులై 24న వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాన్ని ఇచ్చిన తర్వాత పులివెందులలో అతన్ని కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. వారితో పాటు.. మరికొందరు రంగన్న మాటల్ని కొందరు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. వాటికి సంబంధించిన ఫుటేజ్ బయటకు వచ్చి చర్చకు తెర తీసింది.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు నోటీసులు పంపిన సీబీఐ.. వాటికి సంబంధించిన ఫుటేజ్ తీసుకొని రావాలని పేర్కొంది. అంతేకాదు.. ఫోన్లో రంగన్న మాటల్ని రికార్డు చేసిన ఛానళ్లకు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. అందుకు సంబంధించిన ఫుటేజ్ తీసుకురావాలని చెప్పింది. దీంతో.. రంగన్నను ఇంటర్వ్యూ చేసిన కడప.. పులివెందులకు చెందిన మీడియా ప్రతినిధులు పలువురికి సీబీఐ నుంచి తాజాగా నోటీసులు అందాయి. ఈ రోజు పలువురు మీడియా ప్రతినిధులు సీబీఐ విచారణను ఎదుర్కొనున్నారు. రంగన్నను ఇంటర్వ్యూలు చేసిందెవరు? వాటి ఒరిజినల్ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం గెస్టు హౌస్ ఇందుు వేదిక కానుంది.