Begin typing your search above and press return to search.

అవినాష్ ని వదలని సీబీఐ

By:  Tupaki Desk   |   18 April 2023 6:00 PM GMT
అవినాష్ ని వదలని సీబీఐ
X
హై కోర్టులో భారీ ఊరట లభించింది కానీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందే అంటూ నోటీసులు జారీ చేసింది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు అవినాష్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరు అవడం తప్పనిసరి అవుతోంది. సీబీఐ ఎదుట ఇది ఆయనకు అయిదవ విచారణగా ఉండడం విశేషం. గతంలో విచారణ సందర్భంగా అయిదారు గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది.

అయితే అప్పట్లోనే అరెస్ట్ చేస్తారని వినిపించింది కానీ అది జరగలేదు. ఈ లోగా సీబీఐ ఇన్వెస్టింగ్ టీం చీఫ్ మారారు. కొత్త అధికారి వచ్చిన తరువాత జరిగే విచారణ ఇదే కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏ విధంగా విచారణ చేస్తారు. ఏ ఏ ప్రశ్నలు లేవనెత్తుతారు అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోంది.

ఇక మంగళవారమే సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి వస్తారని వార్తలు రావడంతో హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు కనిపించారు. ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ వారిలో కనిపించింది.

ఈ నేపధ్యంలో విచారణ బుధవారానికి మారడం, హై కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో వారంతా ఊపిరిపీల్చుకునారు. ఆ తరువాత అవినాష్ నివాసం నుంచి క్యాడర్ బయటకు వెళ్లిపోయారు. అయితే అవినాష్ రెడ్డి తన నివాసంలో ఉన్నారా లేరా అన్నది మాత్రం తెలియరాలేదు. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ని సీబీఐ విచారణ మాత్రం వదలడంలేదు అంటున్నారు. అంతే కాదు బుధవారం విచారణ తరువాత మరిన్ని విచారణలు ఉంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారని అంటున్నారు.