Begin typing your search above and press return to search.

సీఎంకు.. ఆయ‌న భార్య‌కు షాకిచ్చిన సీబీఐ

By:  Tupaki Desk   |   29 May 2017 7:44 AM GMT
సీఎంకు.. ఆయ‌న భార్య‌కు షాకిచ్చిన సీబీఐ
X
ఆయ‌న ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అంతేనా.. ఆయ‌న స‌తీమ‌ణి సైతం అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో కోర్టుకు వ‌చ్చిన వారికి.. సీబీఐ షాకిచ్చింది. త‌మ‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని వారు ఖండిస్తూ.. త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. వారికి బెయిల్ మంజూరు చేయొద్ద‌ని, బెయిల్ ఇస్తే.. కేసును ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉందంటూ వాదిస్తోంది. ఇప్పుడీ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. ఆయ‌న స‌తీమ‌ణి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ..ఆ ముఖ్య‌మంత్రి ఎవ‌రు? ఏ రాష్ట్రానికి చెందిన వారు అన్న విష‌యాన్ని చూస్తే..

ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం వీర‌భ‌ద్ర‌సింగ్‌.. ఆయ‌న స‌తీమ‌ణిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంది సీబీఐ. దీంతో.. త‌మ‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తూ.. త‌మ‌కు బెయిల్ ఇవ్వాల‌ని సీఎం.. ఆయ‌న స‌తీమ‌ణి కోర్టుకు వ‌చ్చారు. ఇదే అంశంపై సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాదులు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్ద‌ని వాదిస్తోన్నారు.

మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో కేంద్ర ఉక్కుశాఖా మంత్రిగా వీర‌భ‌ద్ర‌సింగ్ వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో రూ.10కోట్ల మేర అక్ర‌మాస్తులు కూడ‌బెట్టార‌ని 2015లో సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ రూ.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జ‌ఫ్తు చేసింది. మ‌రోవైపు.. ఈవ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైంది. ఎన్డీయేత‌ర ప్ర‌భుత్వాల‌పై మోడీ స‌ర్కారు క‌త్తి క‌ట్టింద‌ని.. సీబీఐతో త‌న ప‌నులు చేయిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నిజంగానే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగే స్థాయిలో వీర‌భ‌ద్ర‌సింగ్ కానీ ఉంటే.. అస‌లు కేసులే ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. రూ.10కోట్ల మేర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌టం అంటేనే.. ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చ‌న్న వాద‌న‌ను కాంగ్రెస్ నేత‌లు వినిపిస్తున్నారు. మ‌రి.. సీఎంకు.. ఆయ‌న స‌తీమ‌ణికి బెయిల్ ఇచ్చే విష‌యంలో కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/