Begin typing your search above and press return to search.

వైఎస్ కుటుంబ పెద్దను విచారిస్తున్న సీబీఐ

By:  Tupaki Desk   |   16 Aug 2021 10:30 AM GMT
వైఎస్ కుటుంబ పెద్దను విచారిస్తున్న సీబీఐ
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. గత 71వ రోజు విచార‌ణను కోనసాగిస్తోంది. ఈ క్ర‌మంలో వైఎస్ కుటుంబంలో పెద్దాయ‌న‌గా పేరున్న‌, అలాగే ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ పెద‌నాన్న వైఎస్ ప్ర‌కాశ్‌రెడ్డిని మొట్ట‌మొద‌టి సారిగా సీబీఐ విచార‌ణ‌కు పిల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌ లో సోమ‌వారం సీబీఐ విచార‌ణ‌కు ప్ర‌కాశ్‌ రెడ్డి హాజ‌ర‌య్యారు.

వైఎస్ కుటుంబంలో అంద‌రి కంటే పెద్ద వ‌య‌స్కుడు వైఎస్ ప్ర‌కాశ్‌ రెడ్డి. వృత్తిరీత్యా వ్యాపారి. ఆయ‌న మాట‌కు వైఎస్ కుటుంబంలో ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వం ఇస్తారు. వైఎస్ కుటుంబంలో అంత‌ర్గ‌తంగా స‌మ‌స్య‌లేవైనా వ‌స్తే, ఆయ‌నే ప‌రిష్క‌రిస్తార‌ని సన్నిహితులు చెప్తుంటారు. వైఎస్ జ‌గ‌న్ పులివెందుల‌కు ఎప్పుడెళ్లినా, ప్ర‌కాశ్‌రెడ్డి ఇంటికి త‌ప్ప‌క వెళ్తారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌కాశ్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

వైఎస్ కుటుంబంలోని అన్న‌ద‌మ్ముల మ‌ధ్య విభేదాలున్నాయా, ముఖ్యంగా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కుటుంబంలోని ప్ర‌ముఖుల‌తో వైఎస్ వివేకాకు ఆస్తి త‌గాదాలు, రాజ‌కీయ విభేదాలు, చంపుకునేంత వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు ఉన్నాయా, అనే కోణంలో విచారిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వివేకాతో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు, వాటి ప‌రిష్కారం గురించి ప్ర‌కాశ్‌రెడ్డిని గుచ్చిగుచ్చి అడిగిన‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉంటే .. ఓవైపు సీబీఐ విచారణ జరుగుతుండగానే వివేకా కుమార్తె సునీత రాసిన లేఖ కలకలంరేపింది. ఈ వ్యవహారంపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. సునీత ఇంటి దగ్గర వెంటనే పోలీస్ పికెట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమె లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5:20 గంటల సమయంలో ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తర్వాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత వెల్లడించారు.

వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు శివశంకర్‌ రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.చివరికి, ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని సునీత తెలిపారు. శివశంకర్‌ రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత వెల్లడించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌ రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌ రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు

చాలా రోజులుగా సీబీఐ విచారణ సాగుతున్నా, ప్రస్తుతం అధికారులు తీరు మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరుల పేర్లు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. సీబీఐ నుంచి అధికారిక సమాచారం.. అత్యంత పకడ్బందీగా వుంటోంది. మీడియాలో వచ్చే కథనాల్ని సీబీఐ ఎప్పుడూ పట్టించుకోదు. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజకీయ రచ్చ విషయానికొస్తే, అధికార వైసీపీ మీద టీడీపీ ఆరోపణల తీవ్రత పెరుగుతోంది. వైసీపీ మాత్రం, ఈ వ్యవహారాలపై అస్సలు స్పందించడంలేదు. పూర్తి మౌనం పాటిస్తోంది. ఈ వ్యవహారంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతల నోళ్ళు అస్సలు తెరచుకోవడంలేదు.