Begin typing your search above and press return to search.

విచారణ పేరుతో చిదంబరానికి చుక్కలు చూపిస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 Aug 2019 10:55 AM GMT
విచారణ పేరుతో చిదంబరానికి చుక్కలు చూపిస్తున్నారా?
X
ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది ఇంకా తేల్లేదు. అంటే.. ఆయన కేవలం ఒక నిందితుడు. అది కూడా అల్లాటప్పా.. రోడ్డు పక్కన ఉండే చిల్లరగాడు ఎంతమాత్రం కాదు. దేశ కేంద్ర హోంమంత్రిగా.. ఆర్థిక మంత్రిగా బోలెడన్ని పదవులు చేపట్టిన వ్యక్తి. స్వతహాగా లాయరు కూడా. ఆయన చేసిన తప్పులో.. రాజకీయ ఉన్న లెక్కలో కానీ ఆయనపై ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి.

బుధవారం రాత్రి ఇంటి గోడలు దూకి మరీ చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. ఆయన్ను విచారణ కార్యాలయానికి తీసుకెళ్లటం తెలిసిందే. దాదాపు 65 ఏళ్ల వయసున్న చిదంబరాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఒకప్పుడు తాను ప్రారంభించిన సీబీఐ కార్యాలయానికే నిందితుడిగా వెళ్లారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో కేంద్ర హోం మంత్రిగా పని చేసిన నేత అరెస్ట్ కావటం ఇదే తొలిసారిగా చెప్పాలి. యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఒక వెలుగు వెలిగిన చిదంబరంను సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత.. అర్థరాత్రి 12 గంటల సమయంలోనూ విచారణ జరిపినట్లుగా చెబుతున్నారు.

కక్ష్ సాధింపు చర్యలు.. ప్రతీకార రాజకీయాలు ఉండొచ్చు. కానీ.. గౌరవనీయ స్థానాల్లో పని చేసిన ఒక వ్యక్తిని ఇంతగా వేధింపులకు గురి చేయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఇవాళ మనమేం చేస్తామో.. రేపొద్దున అలాంటి పరిస్థితే మనకు ఎదురవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. గతంలో చిదంబరం వ్యవహరించిన దుందుడుకు వైఖరి ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చి పెట్టినట్లు చెబుతున్నప్పుడు.. ఇప్పుడు అదే తప్పును మోడీషాలు చేయకూడదు కదా?

విచారణ పేరుతో అర్థరాత్రి దాటిన తర్వాత ప్రశ్నలు వేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం (గురువారం) కూడా విచారణ జరిపారు. ప్రశ్నలు అడగటానికి ముందు ఫుడ్ తీసుకోవాలని సూచించారు. అందుకు చిదంబరం నో చెప్పేశారు. దీంతో.. చేసేదేమీ లేక విచారణ షురూ చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగిన విచారణ.. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మళ్లీ సురూ కావటం చూసినప్పుడు.. విచారణ పేరుతో అంత పెద్ద మనిషిని అంతలా వేధించాలా? అన్నది ప్రశ్న. దాదాపు 20 ప్రశ్నలు వేయగా.. గుర్తు లేదు.. చెప్పలేను.. స్పష్టంగా చెప్పలేను అన్న రీతిలో సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. విచారణ పేరుతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలువురు తప్పు పట్టటం గమనార్హం.