Begin typing your search above and press return to search.

దేశ రాజ‌ధానిలో 21 చోట్ల సీబీఐ దాడులు.. ల‌క్ష్యం ఆ పార్టీ నేత‌లేనా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 10:51 AM GMT
దేశ రాజ‌ధానిలో 21 చోట్ల సీబీఐ దాడులు.. ల‌క్ష్యం ఆ పార్టీ నేత‌లేనా?
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఆగ‌స్టు 19న దాడుల‌కు దిగారు. మొత్తం 21 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలోనూ సోదాలను చేపట్టారు. ఆయనతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరవ గోపీకృష్ణ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. మొత్తంగా రాజ‌ధాని రీజియ‌న్ పరిధిలో 21 ప్రాంతాలతో పాటు ఏడు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు.

కాగా ఇటీవ‌ల మ‌నీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌ల్లో ఒక‌రైఐన‌ మ‌నీష్ సిసోడియాపై సీబీఐ దృష్టి పెట్టింద‌ని అంటున్నారు.

ఢిల్లీలో ఎక్సైజ్ పాల‌సీ విధానంపై మ‌నీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు నిర్వ‌హిస్తోంది. కాగా త‌న ఇంటిలో సీబీఐ సోదాలు నిజ‌మేన‌ని మ‌నీష్ సిసోడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. మంచి ప‌నులు చేస్తున్న‌వారిని దేశంలో ఇలా ద‌ర్యాప్తు సంస్థ‌ల ద్వారా వేధిస్తున్నార‌ని సిసోడియా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీబీఐ దాడుల‌కు బెదిరేది లేద‌ని.. ఢిల్లీ సంక్షేమం కోసం తాను చేస్తున్న కృషి ఆగదని మ‌నీష్ సిసోడియా త‌న ట్వీటులో పేర్కొన్నారు.

అదేవిధంగా ఆరోగ్య మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు కూడా అవాస్త‌వ‌మ‌ని మ‌నీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ విద్య‌, ఆరోగ్య రంగాలు అద్భుతంగా ఉన్నాయ‌న్నారు. కొన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థుల కోసం తాను చేస్తున్న కృషిని ఆప‌బోన‌ని మ‌నీష్ సిసోడియా తేల్చిచెప్పారు.

కాగా సీబీఐ దాడుల ప‌ట్ల‌ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప‌రోక్షంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతోందని, సీబీఐని తాము అడ్డుకోలేమని స్పష్టం చేశారు. పై (కేంద్ర ప్ర‌భుత్వం) నుంచి వస్తోన్న ఒత్తిళ్లు, ఆదేశాల వల్లే సీబీఐ అధికారులు ఈ దాడులు చేస్తున్నార‌ని కేజ్రీవాల్ అన్నారు.

ఒక ల‌క్ష్యాన్ని సాధించాల‌నుకున్న‌ప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తాయ‌ని.. వాటిని అధిగమించి ముందుకు వెళ్తామ‌ని కేజ్రీవాల్ వెల్ల‌డించారు. అడ్డంకులు ఎవరు సృష్టిస్తోన్నారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. వారు చేస్తున్న ప‌నికి తగిన మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి ఏర్పడి తీరుతుందని అన్నారు.

మనీష్ సిసోడియాను గ‌త ఏడేళ్లుగా ఇలా దాడుల పేరుతో వేధిస్తున్నార‌ని గుర్తు చేశారు. అయినా ఎందులోనూ ఆయనను కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇరికించలేకపోయారన్నారు. ఎన్నో త‌ప్పుడు కేసులు పెట్టార‌ని.. ఒక్క‌దానిలో కూడా సిసోడియా ప్రమేయం ఉన్నట్లు నిరూపించలేకపోయారని చెప్పారు.

తనతో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్‌పై ఎన్ని దాడులు చేసినా.. తమ తప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నిరూపించలేక చేతులెత్తేసిందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాశాఖ మంత్రిగా మనీష్ సిసోడియా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ది న్యూయార్క్ టైమ్స్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క‌ పత్రిక కూడా ఆయనపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించిందన్నారు.

దేశం ఇప్పుడు ఏకం కావాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికోసం తాను నేషనల్ మిషన్‌ను ప్రారంభించబోతున్నానని తెలిపారు. ప్రపంచంలోనే దేశం అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశించే వారు 9510001000 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.