Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో భారీ స్కాం..అక్రమంగా 2 లక్షల తుపాకీ లైసెన్సులు

By:  Tupaki Desk   |   31 Dec 2019 9:59 AM IST
కశ్మీర్ లో భారీ స్కాం..అక్రమంగా 2 లక్షల తుపాకీ లైసెన్సులు
X
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న వేళ.. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్ముకశ్మీర్ ప్రాంతంలో భారీ స్కాం ఒకటి బయటకు వచ్చింది. సీబీఐ చేపట్టిన విచారణలో బయటకు వచ్చిన అంశాలు షాకింగ్ గా మారాయి. గడిచిన పదేళ్లలో దాదాపు రెండు లక్షల తుపాకీ లైసెన్సుల్ని మంజూరు చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి పలు కేసుల్ని పోలీసులు నమోదు చేస్తున్నారు.

కశ్మీర్ లోని 17 ప్రాంతాల్లోనూ.. హర్యానా.. పంజాబ్.. యూపీల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తుపాకీ లైసెన్సులు ఇచ్చిన విషయాన్ని గుర్తించారు. గడిచిన పదేళ్లలో రెండు లక్షల తుపాకీ లైసెన్సులు మంజూరు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు.

ఆర్టికల్ 370 నిర్వీర్యం అనంతరం జమ్ముకశ్మీర్.. లద్దాక్ లు రెండు యూటీలుగా ఏర్పడటంతో తాజాగా విచారణ నిర్వహించేందుకు వీలైంది. ఈ తుపాకీ లైసెన్సుల విచారణ సాగే కొద్దీ మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ విషయం మీద గతంలోనే సీబీఐ రెండు కేసుల్ని నమోదు చేసింది. పప్పు బెల్లాలు పంచినట్లుగా జమ్ముకశ్మీర్ లోని వివిధ జిల్లాల్లో తుపాకీ లైసెన్సులు ఎలా జారీ చేశారు? దాని వెనుక ఉన్నది ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.