Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర సీఎం ఇంటిని సీబీఐ చుట్టేసింది

By:  Tupaki Desk   |   27 Sep 2015 4:29 AM GMT
ఆ రాష్ట్ర సీఎం ఇంటిని సీబీఐ చుట్టేసింది
X
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని సీబీఐ చుట్టుముట్టేస్తుందా?అందులోనూ కుమార్తె వివాహం కోసం హడావుడి పడుతూ.. వివాహ సమయంలో సీఎం ఆస్తులున్న ప్రాంతాలన్నింటి మీదా ఒకేసారి తనిఖీలు నిర్వహించటం సాధ్యమేనా? రాజకీయాల్లో భావోద్వేగాలకు ఏ మాత్రం తావు ఉండదన్నట్లుగా కనిపించే వైనం హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి వీరభద్రసింగ్ వ్యవహరిస్తున్నారు. ఆయన కుమార్తె వివాహం శనివారం జరిగింది. తన అధికార నివాసం నుంచి పెళ్లి మండపానికి బయలుదేరి వెళ్లిన కాసేపటికే.. సీబీఐ అధికారులు వాహనాల్లో వచ్చేసి.. ముఖ్యమంత్రి ఇంటిని చుట్టుముట్టేయటమే కాదు.. ఆయనకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల దగ్గర ఇదే తరహాలో తనిఖీలు నిర్వహించటం ఇప్పుడా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ దాడులు నిర్వహించటం.. ఇది కూడా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరగటం పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఓ ముఖ్యమంత్రి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే.. ఇలాంటి దాడులు చేస్తారా? అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఐదు వాహనాల్లో ఇంటి నుంచి కల్యాణ మండపానికి బయలుదేరిన కాసేపటికే సీబీఐ అధికారుల బృందం దాడులు నిర్వహించింది.

ఓపక్క పెళ్లి జరుగుతుంటే.. మరోవైపు తన ఆస్తులున్న 11 ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేయటం.. ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి ఎదురుకావటం గమనార్హం. పెళ్లి కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించుకొని ఇంటికి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి మీడియా ప్రతినిధులు.. అధికారులు ఎదురుకావటం.. వారితో ఏమీ మాట్లాడకుండానే ఆయన ఇంట్లోకి వెళ్లిపోవటం జరిగిపోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం.. సీబీఐ అధికారులు అనుకోవాలే కానీ.. సీఎం ఇంటినైనా ఇట్టే చుట్టుముట్టేసి తనిఖీలు చేసేయగలరని ప్రజాస్వామ్య భారతంలో నిరూపితమైంది.